రైతుల తరపున భువనేశ్వరి పోరాటం... లోకేష్ ని తప్పించడానికేనా?

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రగడ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదంటూ.. అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మద్దతుగా నిలుస్తూ పోరాడుతోంది. ఈ పోరాటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పాలుపంచుకున్నారు. తాజాగా భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలపటమే కాకుండా, రైతుల కోసం అమరావతి పరిరక్షణ సమితికి ఖరీదైన తన బంగారు గాజులు విరాళంగా కూడా ఇచ్చారు. అయితే భువనేశ్వరి ఉన్నట్టుండి.. ఇలా రైతుల కోసం ప్రత్యక్షంగా పోరాటంలో పాలుపంచుకోవడం వెనుక.. రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది.

కొన్నేళ్లుగా చంద్రబాబు తరువాత టీడీపీని నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. చంద్రబాబు తరువాత ఆయన కుమారుడు లోకేష్ టీడీపీని నడిపిస్తారని మొదట్లో పార్టీ శ్రేణులు భావించాయి. కానీ లోకేష్ పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులకు నమ్మకాన్ని కలిగించలేకపోయారు. ముఖ్యంగా మాటతీరు లోకేష్ కు పెద్ద సమస్యగా మారింది. ఆయన తెలుగు పదాలు పలకడంలో కాస్త ఇబ్బందిపడతారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు పప్పు అంటూ ఆయనను బాగా టార్గెట్ చేశాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడంలో, ప్రత్యర్థి పార్టీల మీద ఎదురుదాడి చేయడంలో లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. ఇక కార్యకర్తలను కలుపుకొని వెళ్లడంలో కూడా లోకేష్ వెనకబడిపోయారు. ఒకరిద్దరిని పక్కన తిప్పుకోవడం తప్ప.. భవిష్యత్తు నేతనన్న భరోసా కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనస్సు గెలుచుకోలేకపోయారు. ఇలా పలు కారణాల వల్ల చంద్రబాబు తరువాత టీడీపీ ని నడిపించే నేత లోకేష్ అనే భరోసా ఆ పార్టీ కార్యకర్తల్లో కలగలేదు. దీంతో చంద్రబాబు రిటైర్మెంట్ తరువాత పార్టీ నడిపించేది ఎవరనే ప్రశ్న పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. అయితే ఆ లోటుని భర్తీ చేయడానికే చంద్రబాబు.. భువనేశ్వరిని రంగంలోకి దింపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరి అంటే తెలుగు ప్రజలకు గౌరవముంది. ఆమె మంచి వాగ్దాటి కూడా. గతంలో ఆమె పలు సందర్భాల్లో ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడారు. తాజాగా అమరావతిలో కూడా ఆమె ప్రసంగం ఆకట్టుకుంది. మాకు కుటుంబం కంటే.. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల క్షేమమే ముఖ్యమంటూ సెంటిమెంట్ ని రగిల్చేలా మాట్లాడారు. ఆమె ఇలానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజా సమస్యలపై గళాన్ని వినిపిస్తూ ఉంటే.. టీడీపీ భవిష్యత్తు సారథిగా ఆమెపై పార్టీ శ్రేణులకు నమ్మకం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఎన్టీఆర్ కుమార్తెగా, ఇటు చంద్రబాబు సతీమణిగా.. ఆమెకు కార్యకర్తలు బ్రహ్మరధం పట్టే అవకాశముంది. అంతేకాదు ఆమె ప్రసంగం మహిళలను కూడా ఆకట్టుకునేలా ఉంది. అదీగాక ఆమె మీద గౌరవంతో అంత త్వరగా ప్రత్యర్థులు విమర్శలు కూడా చేయకపోవచ్చు. ఇలా ఆమెకి పలు అంశాలు కలిసొస్తున్నాయని అంటున్నారు. అందుకే, ఆమె ఇలాగే ముందుకెళ్తే టీడీపీ భవిష్యత్తు సారధి అయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పై వస్తున్న విమర్శలకు బ్రేకులు వేయాలన్నా, పార్టీ భవిష్యత్తు గురించి కార్యకర్తల్లో భరోసా కల్పించాలన్నా.. భువనేశ్వరిని తెరపైకి తీసుకురావడం కరెక్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారట. అందులో భాగంగానే ఆమె అమరావతి రైతుల తరపున పోరాటంలో పాలుపంచుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్తులో టీడీపీని నడిపించే బాధ్యతని భువనేశ్వరి తీసుకుంటారేమో చూడాలి.