ఒక పరాజయం 100 తప్పులు.. అడ్డూ అదుపూలేని దుబారా..!!

 

విభజన అనంతరం కొత్త రాష్ట్రానికి అనుభవమున్న చంద్రబాబు సీఎం అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని ఏపీ ప్రజలు భావించారు. అందుకే ఏపీ ప్రజలు 2014 ఎన్నికల్లో బాబుకి పట్టంకట్టారు. కానీ బాబు చేసిన కొన్ని తప్పుల మూలంగా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. గత ఐదేళ్లల్లో బాబు చేసిన తప్పుల్లో దుబారా ఖర్చు ప్రధానమైనదని చెప్పవచ్చు. నూతన రాష్ట్రం, రాజధాని లేదు, లోటు బడ్జెట్.. ఇలా ఎన్నో సమస్యలున్న వేళ సీఎం అయిన బాబు.. అనసరంగా హంగు ఆర్భాటాలకు పోయి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు.

ప్రమాణ స్వీకారంతో మొదలైన దుబారా.. బాబుని ప్రతిపక్షానికి సాగనంపేలా చేసింది. అసలే లోటు బడ్జెట్ అంటే కోట్లు ఖర్చుతో ప్రమాణ స్వీకారం చేసారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని భవనాల మరమత్తులు, ఆధునీకరణ పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. తీరా కొద్ది నెలలు కూడా ఉండకుండానే అమరావతికి మకాం మార్చారు. అక్కడ తాత్కాలిక భవనాలకు కోట్ల ఖర్చు. వీటికితోడు విదేశీ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు. ఇక నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు సరేసరి. దీక్ష అంటే ఓ టెంట్ వేస్తే సరిపోతుంది. కానీ బాబు దీక్షలు మాత్రం.. భారీ స్టేజ్, చుట్టూ క్లాత్ డెకరేషన్, ఏసీలు అబ్బో ఇలా మాములు హడావుడి కాదు. బాబు అనుభవం కొత్త రాష్ట్రానికి ఎంతలా ఉపయోగపడింది అనే దానికంటే.. బాబు చేసిన దుబారా అప్పటి విపక్ష వైసీపీకి మాత్రం మంచి అస్త్రం అయిందనే చెప్పాలి. బాబు దుబారాను వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత మొదలై, అది ఎన్నికల్లో ఓడించే వరకు వెళ్లిందనే చెప్పాలి.