వకీల్ సాబ్ కు చంద్రబాబు సపోర్ట్

వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. వైసీపీ సర్కార్ పై విపక్షాలన్ని విరుచుకుపడుతున్నాయి. మాములుగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. గతంలో చాలా సినిమాలకు ఈ అవకాశం వచ్చింది. కాని పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌ పై కక్ష కట్టిన జగన్ సర్కార్.. బెనిఫిట్ షోలు రద్దు చేసింది. టికెట్ల బుకింగ్ ముగిశాకా బెనిఫిట్ షోలు రద్దు చేశారు. గత నెలలో విడుదలైన ఉప్పెన సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు వకీల్ సాబ్ కు మాత్రం జగన్ సర్కార్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. 

వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని, రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని పవన్ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగన్ సర్కార్ తీరును ఎండగడుతూ పవన్ కల్యాణ్ కు అండగా నిలిచారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పవన్ కల్యాణ్ సినిమాని అడ్డుకుంటారా? అని, హైకోర్టు అనుమతి ఇస్తే హౌస్ పొజిషన్‌కి వెళతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతో తాను మాట్లాడటం లేదని, ధర్మం, న్యాయం కోసం అడుగుతున్నానన్నారు. సూళ్లూరు‌పేట రోడ్ షోలో ప్రసంగించిన చంద్రబాబు.. జగన్ రెడ్డికి భయపడితే ఇంట్లో నుంచి కూడా రానని చెప్పారు.

సొంత బాబాయిని చంపేస్తే నిందితులను శిక్షించాలనే ఆలోచన కూడా రాదా? ఎన్నికలకి ముందు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షిలో బ్రేకింగ్స్ ఇచ్చారు.. సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపించారు. ఆయన కుమార్తె ఫోన్ చేసి మృతిపై అనుమానాలున్నాయని అన్నారు.. విచారణలో గొడ్డలితో నరికి చంపేశారు. నేను, నా మనుషులు వివేకను చంపేశానని అన్నారు.. చిన్నాన్నని చంపిన వ్యక్తులని కాపాడే సీఎంకి మిగిలిన వాళ్లు ఓ లెక్కా?. నారా లోకేశ్ తిరుపతిలో ప్రమాణం చేద్దాం రమ్మంటే తోకముడిచారు.’’ అని చంద్రబాబు విమర్శించారు.

తిరుపతి ఉప ఎన్నిక చరిత్ర సృష్టించబోయే ఎన్నిక అన్నారు చంద్రబాబు. టీడీపీకి అవకాశం ఇవ్వాలని  కోరారు. ‘‘మీ ఉత్సాహం, కేరింతలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. సూళ్లూరుపేటకి ఓ ప్రత్యేకత ఉంది. రాజ్యాంగం రాసిన వారు ఇక్కడే పుట్టారు. జగన్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నాడు. నాకేం సీఎం పదవి కొత్తకాదు. నా రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేరు. తొమ్మిదేళ్లు సమైక్యాంధ్రకి, అయిదేళ్లు నవ్యాంధ్రకి సీఎంని చేశారు. కసిగా కష్టపడి నవ్యాంధ్రని అభివృద్ధి చేసుకున్నాం. 2029 నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ చేయాలనుకున్నాం. రెండేళ్లు అయింది వైసీపీ వచ్చి. నాడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దుకుంటూ వస్తున్నాడు. అందర్నీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ రెడ్డి‌. మీ ఓటు ద్వారా రాష్ట్రాన్ని కాపాడుకునే అవకాశం వచ్చింది. పనబాక లక్ష్మిని మీరంతా ఆశీర్వదించాలి. పార్లమెంట్‌లో టీడీపీ బలాన్ని మరింత పెంచండి.’’ అని చంద్రబాబు కోరారు.