జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్

జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిపై మళ్లీ ఎన్నికలకు వెళదామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాజాగా అమరావతి విషయం పై స్పందిస్తూ సిఎం జగన్‌కు తాము 48 గంటల సమయం ఇస్తున్నామని.. అమరావతి అంశంపై అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరపాలని అయన డిమాండ్ చేశారు. 

2014 లో అసెంబ్లీలోను.. అలాగే మొన్న 2019 ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని మాట్లాడిన జగన్ తో సహా వైసీపీ నేతలకు ఇప్పుడేమైందని అయన ప్రశ్నించారు. రాజధాని అనేది తన ఒక్కడి సమస్య కాదని, ఇది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం అని అయన స్పష్టం చేశారు. 

" 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంతో బాధపడ్డాం. దీంతో కాంగ్రెస్ పార్టీకి అపుడు ప్రజలు కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. ఐతే ఇప్పుడు వైసీపీ కూడా అదే రీతిలో ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. అసలు ఎన్నికలకు ముందు మీరేం చెప్పారు, ఎన్నికల తర్వాత మీరేం చేస్తున్నారు అని అయన వైసిపి నాయకులను నిలదీశారు. ఎన్నికల ముందు ప్రజలకు రాజధాని గురించి ఏమీ చెప్పకుండా మభ్యపెట్టి,. ఎన్నికల తర్వాత మూడు రాజధానులు చేస్తామంటూ వైసిపి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని బాబు దుయ్యబట్టారు. 

ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకు లేదని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు తాము 48 గంటలు సమయం ఇస్తున్నామని ఒక వేళ మీ నిర్ణయానికి ప్రజల్లో మద్దతు ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం. మీరు గనుక గెలిస్తే అమరావతి అంశం పై ఇక మేం మాట్లాడం. అంతే కాకుండా ఈ అంశంలో మీరు ఏంచేసినా మేం నోరెత్తం. కానీ ప్రజలకు చెప్పకుండా ఇలా కీలకమైన రాజధానిపై నిర్ణయం తీసుకుంటే మాత్రం అది నమ్మించి మోసం చేసినట్టవుతుంది అని అయన స్పష్టం చేసారు . 

మాట తప్పం మడమ తిప్పం అని చెప్పుకునే మీరు 2014 సెప్టెంబరు 4న ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏం చెప్పారు? "అధ్యక్షా, విజయవాడలో రాజధాని ఏర్పాటు చేయడాన్ని మేం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏంటంటే, మన రాష్ట్రం 13 జిల్లాల చిన్నరాష్ట్రంగా మారింది. ఇంత చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేక, రాజధాని నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాజధాని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి కానీ కనీసం 30 వేల ఎకరాలైనా ఉండేట్టు చూడండి" అని మీరే కదా చెప్పింది.. మరి ఇప్పుడేమైనా మనది పెద్ద రాష్ట్రంగా మారిపోయిందా? ఈరోజు ఏమొచ్చిందని రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు? మీ ఈ నిర్ణయం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం కాదా?" అంటూ చంద్రబాబు సీఎం జగన్ ను ప్రశ్నించారు.