ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు...

- జవాబుదారీతనంతో పని చేయండి 
- ఎపి ప్రభుత్వానికి చంద్రబాబు హితవు

 
కరోనా వ్యాధి నిరోధక చర్యల పట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎపి ప్రభుత్వానికి హితవు పలికారు. కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

యూఎస్, స్పెయిన్, ఇటలీలో కరోనా విజృంభిస్తోందని చెప్పారు. భారతదేశంలో  వారం రోజుల్లో 222 శాతం కరోనా పెరగడం ఆందోళనకర పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసం నుండి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో వారంలో 1,021 శాతం కరోనా పెరిగిందని, ఇది చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. దేశంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని, ఏపీలో కరోనా పరీక్షల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. ఏపీలో కేవలం 6 ల్యాబ్‌లే ఉన్నాయని, టెస్టింగ్‌లు చాలా తక్కువగాజరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో రోజుకు ఎంతమందికి టెస్టులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పడం లేదని ఆయన విమర్శించారు. వాస్తవాలు బయటకు చెప్పకపోవడం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. 

బాధ్యత కలిగిన వ్యక్తులు జాగ్రత్తగా మానిటర్ చేయాలని, వ్యక్తి, వ్యవస్థ విఫలమైతే చాలా ప్రమాదం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. కరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. 

ప్రధాని పిలుపునకు నిన్న దేశ ప్రజలంతా సంఘీభావం తెలిపారన్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. ఇంటి పరిసరాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. 
ప్రజలంతా సామాజిక దూరం తప్పనిసరి పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

పరస్పరం షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానుకోవాలని చెప్పారు. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం నెలకొందని, అమెరికాలాంటి దేశాల్లో వెంటిలేటర్లు దొరకడం లేదని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. యూఎస్ వ్యాప్తంగా  చాలా ఆస్పత్రుల్లో మృతదేహాలు పేరుకుపోయాయని, అంత్యక్రియలు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాపై తప్పుడు వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. మత, రాజకీయ సదస్సులను నిర్వహించకూడదని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

కరోనాకు మెడిసిన్ కనుక్కొనే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. రాష్ట్రంలో పేదలను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.  రాష్ట్రంలో పేదలకు తొలివిడతగా కనీసం రూ.5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని,. తెల్లరేషన్ కార్డుదారులందరికీ డబ్బులు ఇవ్వాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న నగదుతో పాటు, రాష్ట్రం కూడా ఇవ్వాలని కోరారు. ఇతరులపై ఆధారపడకుండా రాష్ట్రమే వెంటిలేటర్లను తయారు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. వెంటిలేటర్ల తయారీకి ముందుకొస్తున్న సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పారు. 

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని సూచించారు.  ఆక్వా, హార్టికల్చర్, పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. 

ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగుల చేత అవసరమైతే ఇంటినుంచే పని చేయించాలని సూచించారు. డబ్బులు కాంట్రాక్టర్లకు కాదు, ఉద్యోగులకు ఇవ్వాలని హితవు పలికారు.

అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించొద్దని ఎపి ప్రభుత్వానికి సూచించారు. మంచి చేయడానికి అధికారం ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు.  కరోనా కేసులు పెరగడానికి ఓ మతానికి ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

కేంద్రం నుంచి డబ్బులు వస్తే వైసీపీ వాళ్లు ప్రచారం చేసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. 

సరైన సమయంలో క్వారంటైన్ చేసి ఉంటే కేసులు పెరిగి ఉండేవి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం సరికాదని సలహా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లడంతో అమెరికాకు నష్టం వాటిల్లిందని, ట్రంప్ అసమర్థత చూసైనా జగన్ కళ్లు తెరవాలని చంద్రబాబు హితవు పలికారు. చరిత్రలో ఎప్పుడూ చూడని సమస్య ఇది...  ప్రభుత్వం నిపుణుల సూచనలు తీసుకుని అమలు చేయాలని చంద్రబాబు చెప్పారు.