రమణ దీక్షితులు ఇక సైలెంట్ అవుతారా

 

శ్రీవారి ఆభరణాలు తరలించారంటూ, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొద్దిరోజుల నుండి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ, స్వామీ వారి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచి.. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చేసింది.. టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా పాలక మండలి సభ్యుల కోసం శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించారు.. బోర్డు సభ్యులు వీటిని పరిశీలించారు.. శ్రీవారి ఆభరణాలు అన్నీ ఉన్నాయని, రూబీ ఒకటి పగిలిపోయిందని, దాని విలువ రూ. 50గా రికార్డులో నమోదు చేసి ఉందని తెలిపారు.. అలానే రమణ దీక్షితులు చెబుతున్న పింక్ డైమండ్ అసలు లేనే లేదని పేర్కొన్నారు.

శ్రీవారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు..  తాజాగా అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ విషయంపై బాబు స్పందించారు.. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి నగలపై ప్రత్యేక కమిటీతో న్యాయ విచారణ చేపడతామని ప్రకటించారు.. ఆ కమిటీ ముందే, రెండేళ్లకోసారి నగల పరిశీలన చేస్తామని, అదే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.. అదే విధంగా కొంతమంది లేని నగలు, డైమండ్లు పోయాయంటూ రాజకీయాలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు.. మొత్తానికి శ్రీవారి ఆభరణాల గురించి వస్తున్న ఆరోపణలకి టీటీడీ ఆభరణాల ప్రదర్శన చేసి ఆరోపణలు అవాస్తవమని నిరూపించడం అలానే టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆభరణాల రక్షణకోసం కీలక నిర్ణయం తీసుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.