టీడీపీ నుంచి వైసీపీకి వలసలు.. కేసీఆర్ హస్తముంది!!

 

ఏపీలో అధికార పార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి పలువురు నేతలు వలస వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ వలసల వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తం ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చంద్రబాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలతో జగన్‌కు దిక్కు తోచడం లేదన్నారు. కేసీఆర్ సాయంతో టీడీపీ నేతలను జగన్ వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని వైసీపీలో చేరమని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంకా ఒకరిద్దరు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య పెడుతున్నారని.. అలా పోయే వారిని పట్టించుకోవద్దని నేతలకు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే అని తేల్చిచెప్పారు. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి అన్నదాత సుఖీభవ వేడుకలు నిర్వహించాలని నేతలను సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాలతో జగన్‌కు ఫ్రస్టేషన్ పెరిగిందని విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్‌తో కలిసి జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై కేసులు వేసినవాళ్లతో వైసీపీ లాలూచీపడిందన్నారు.

కేంద్రానికి తెలిసే పుల్వామాలో దాడి జరిగిందని మమతాబెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారని చంద్రబాబు అన్నారు. దేశ భద్రత కోసం ఐక్యంగా పోరాడేందుకు మనం వెనుకాడం కానీ.. మోదీ తన స్వార్థం కోసం ఏమైనా చేయగలరని వ్యాఖ్యానించారు. గోద్రాలో 2వేల మందిని చంపేశారని ఆరోపించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోదీ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. జవాన్లకు అండగా నిలుస్తాం కానీ, రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టుపెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.