అదే నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి!!

జగన్ నాటకాలు నమ్మి ప్రజలంతా పూనకం వచ్చినట్టు ఓట్లేశారని.. తానేం తప్పు చేసానో తనకు తెలీదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తాను కోరుకున్నానని.. అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఏమాత్రం సంతోషంగా లేరని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని.. అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అబద్దం చెప్పి అడ్డంగా దొరికిన దొంగ అని విమర్శించారు.

 

ప్రజావేదికను కూల్చి ఇంతవరకు ఆ శిథిలాలను తొలగించకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా, బూతుల మంత్రులు తనను విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని అన్నారు. మీటర్లు వ్యవసాయ మోటార్లకు కాదు మంత్రులకు పెట్టాలని అన్నారు. వైసీపీ మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో తెలుస్తుందన్నారు.

 

ఈ ప్రభుత్వం చివరికి పెంపుడు జంతువులను కూడా వదలడం లేదని, వాటిపైనా పన్నులు విధిస్తోందని దుయ్యబట్టారు. రేపో మాపో పీల్చే గాలిపై పన్ను వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 30వేల కోట్ల అప్పు, 70వేల కోట్ల పన్నులు మోపారని తెలిపారు. ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70వేలు భారం మోపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపుతున్న భారాన్ని జీవితాంతం మోయాల్సిన దుస్థితి నెలకొందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.