‘గీతం’పై ఆ గగ్గోలేమిటి ‘బాబూ’..

బాబు బంధువుల కోసమా మా పోరాటం?

 

తల పట్టుకుంటున్న తముళ్లు

 

అధికార వియోగం అనుభవిస్తున్న, టీడీపీ నాయకత్వం అడుగులు తడబడుతున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అధినేత చంద్రబాబునాయుడు అయోమయం కనిపిస్తోంది. ఊపిరాడకుండా జగనన్న,  నలుచెరుగులా పెట్టిన లాక్‌డౌన్‌తో నాయుడు గారి అనుభవం కూడా, అయోమయంలో పడినట్లుంది. అందుకు గీతం యూనివర్శిటీ వ్యవహారమే ఉదాహరణ. అది పూర్తిగా ప్రైవేటు యూనివర్శిటీ. ప్రభుత్వానికి సంబంధం లేదు. అలాంటి యూనివర్శిటీపై చాలా ఏళ్ల నుంచి భూ ఆక్రమణ కేసులున్నాయి. తాము కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయమని స్వయంగా పెట్టుకున్న దరఖాస్తులున్నాయి. ఈ క్రమంలో వాటిని జగన్ సర్కారు తొలగించే ప్రయత్నం చేసింది. కాకపోతే ఉదయం కాకుండా, అర్ధరాత్రి కూల్చివేతలు చేపట్టింది. ఇదీ విశాఖపట్నం గీతం యూనివర్శిటీ కథ.

 

అయితే ఆ అర్ధరాత్రి కూల్చివేతలపై, తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కక్ష సాధింపు చర్య అని ఖండించింది. అధినేత చంద్రబాబు ఖండన ప్రకటన వెలువడిన వెంటనే.. నేతలంతా దాన్ని అందుకున్నారు. అయితే, ఈ ‘అతి వ్యవహారేమిటో’అర్ధం కాక తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. ప్రైవేటు యూనివ ర్శిటీలో ఆక్రమణలు తొలగిస్తే, తమ పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుందో? అది ప్రజాసమస్య ఎలా అవుతుందో  అర్ధంకాక, పాపం తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. పైగా..గీతంపై గగ్గోలు పెడుతున్న నేతలెవరూ.. అవి అక్రమ నిర్మాణాలు కావు. అక్కడ అక్రమ కట్టడాలు లేవని చెప్పడం లేదు. అంతా సక్రమంగా కొనుగోలు చేసిన భూములేనని వాదించలేకపోతున్నారు. అదో విచిత్రం.

 

కానీ, లలిత జువెలరీ అధినేత తన యాడ్‌లో,   ‘డబ్బులు ఎవరికీ  ఊరకనే రావని’ చెప్పినట్లు.. బాబు గారు కూడా ‘ఏదీ ఊరకనే చేయరన్న’ విషయం, తమ్ముళ్లు తెలుసుకోకపోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే.. సదరు గీతం యూనివర్శిటీ,  బాబు బావమరిది కమ్ వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ అల్లుడిది. అంటే లోకేష్ తోడల్లుడిదన్నమాట. అదన్న మాట సంగతి! గీతం అధినేత భరత్, గత ఎన్నికల్లో విశాఖ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

 

అందుకే ప్రైవేటు యూనివర్శిటీ అయినప్పటికీ, బంధువుల కోసం బాబు కష్టపడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు గళం విప్పుతున్న పార్టీ అధినేత.. తన పార్టీ నేత కమ్ బంధువు ఆస్తిని స్వాధీనం చేసుకుంటే అడ్డుకోకపోతే ఎలా? లేకపోతే భరత్‌బాబు ఫీలయి, అలగడూ? పైగా ఇదంతా అల్లుళ్ల వ్యవహారమాయె! అయితే.. యావత్ టీడీపీ తమ్ముళ్లంతా, గీతంపై సర్కారు చర్యను ఖండిస్తే, సొంత మామయిన బాలకృష్ణ మాత్రం మౌనంగా ఉండటమే ఆశ్చర్యం. మరి మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా?

 

సరే.. అసలు గీతం యూనివర్శిటీ భూములపై, సర్కారు ఎందుకు దృష్టి సారించిందో ఓసారి చూద్దాం. గీతం కాలేజీ కాంపౌండ్ వాల్ పరిథిలో, 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఆ యూనివర్శిటీ సర్వేయర్లు- రెవిన్యూ అధికారులు కలసి గుర్తించారు. మరో 18 ఎకరాలు కాంపౌండ్‌కు ఆనుకుని ఉంది. అంటే మొత్తం 40 ఎకరాలు గీతం యూనివర్శిటీ కబ్జాలో ఉందన్నమాట. నిబంధనల ప్రకారం 5 నెలల క్రితమే గీతం ఆధీనంలో ఉన్న భూమిని, అధికారులు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. కానీ  ముందస్తు నోటీసలివ్వకుండా, అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు, మిత్ర మీడియా విరుచుకుపడుతోంది.

 

అయితే, కూల్చివేతల ముందు నోటీసు ఇవ్వలేదన్న, తమ్ముళ్ల వాదన విస్మయం కలిగిస్తోంది. మరి ఆ ప్రకారంగా.. 40 ఎకరాలు ఆక్రమించిన సదరు గీతం యూనివర్శిటీ యజమాని, వాటిని ఆక్రమించే ముందు ప్రభుత్వానికేమైనా నోటీసులిచ్చారా.. అని ప్రశ్నిస్తే పోయే పరువు పార్టీదే కదా? ఇలాంటి ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, దానిని రాజకీయం చేయడం వల్ల.. తమకు వచ్చేదేమీ లేకపోగా, జరిగే నష్టమే ఎక్కువని తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. పైగా, ప్రజల కోసం కాకుండా, బాబు బంధువుల కోసమే పోరాడుతున్నారన్న సంకేతాలు వెళితే.. బాబుపై కొద్దోగొప్పో ఉన్న గౌరవం కూడా, పోయే ప్రమాదం లేకపోలేదని మొత్తుకుంటున్నారు.

 

మరి గీతంపై ఇంత అవ్యాజానురాగాలు ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయుడు.. తాను అధికారంలో ఉన్నప్పుడే, వాటికి అనుమతులన్నీ ఇచ్చేస్తే,  ఈ పంచాయతీ ఉండేది కాదు కదా? అన్న సందేహం మెడ మీద తల ఉన్న ఎవరికయినా రావచ్చు. మంత్రులు బొత్స, ముత్తంశెట్టికి ఆల్రెడీ వచ్చేసి, అదే ప్రశ్న సంధించారు కూడా. నిజానికి తాము ఆక్రమించిన ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయమని, పాపం గీతం యూనివర్శిటీ 2014లో అప్పటికీ శాస్త్రప్రకారం, దరఖాస్తు కూడా చేసింది. మరి అప్పుడే ఆ పనేదో చేయకుండా,  ఇప్పటి సర్కారు చేసిన స్వాధీన ప్రయత్నాలను అడ్డుకోవడం వల్ల,  టీడీపీకి రాజకీయంగా వచ్చే ఫాయిదా ఏమిటన్నదే ప్రశ్న. హబ్బే.. ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇంకా స్కూలు మార్చకపోతే ఎట్టా?

 

అటు జగనన్న సర్కారు కూడా కేవలం గీతంపై మాత్రమే ప్రేమ చూపకుండా, ఇలాంటి గీతం యూనివర్శిటీలకు అన్న-తమ్ముళ్లపై కూడా చూపిస్తే బాగుంటుంది. ఎలాగూ ఆక్రమణ అని తేల్చినందున, ఆ తొలగింపులేవో ఉదయమే చేయకుండా, ఈ అర్థరాత్రి ఎపిసోడ్లు ఎందుకో అర్ధం కాదు. బహుశా జగన్‌బాబుకు అర్ధరాత్రి నిర్ణయాలు అచ్చివచ్చినట్లున్నాయి. ప్రజావేదిక నుంచి మొదలయిన ఈ సెంటిమెంటనే ఆయింట్‌మెంట్ విశాఖ వరకూ పూస్తున్నట్లున్నారు. పనిలో పనిగా, వైసీపీ వీరులు కూడా కబ్జాలు చేసిన భవనాలను కూడా ఇలాగే పెకిలిస్తే.. ‘జగన్ అనే నేను’ సినిమా మరింత విజయవంతమవుతుంది కదా?! సీఎం గారూ... మీకు అర్ధమవుతోందా?!

-మార్తి సుబ్రహ్మణ్యం