అలక వీడిన గంటా

 

ఏపీ రాజకీయాల మీద ఒక తెలుగు న్యూస్ ఛానల్ లగడపాటి టీంతో కలిసి సర్వే చేయించిన విషయం తెలిసిందే.. ఈ సర్వే, మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పింది కానీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలిలో ఓడిపోతారని చెప్పింది.. దీనితో మిగతా టీడీపీ నేతలు హ్యాపీగా ఉన్నా, గంటా మాత్రం హ్యాపీగా లేరు.. ఈ సర్వే వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉంటున్నారు.. దీనికి తోడు గంటా టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయి.. అయితే ప్రస్తుతానికి ఆ వార్తలు వార్తలుగానే మిగిలిపోనున్నాయి.. 

ఎందుకంటే గంటా అలక వీడారు.. పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పచ్చజెండా ఊపారు.. ఈ రోజు భీమిలి నియోజక వర్గంలో చంద్రబాబు పర్యటన ఉంది.. ఆ నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా పాల్గొనకపోతే బాగుండదని భావించిన బాబు, మంత్రి చినరాజప్పను గంటా ఇంటికి పంపారట.. అలానే బాబు గంటాతో ఫోన్లో స్వయంగా మాట్లాడారట.. "అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? రాజకీయాల్లో ఇవి సహజం.. నా మీద రోజూ ఏవేవో వార్తలొస్తాయి.. 

అంతెందుకు ఆ సర్వేలో కొన్ని నియోజక వర్గాల్లో నా పనితీరు కూడా బాలేదని అభిప్రాయపడినట్టు వచ్చింది.. వీటిని మనం ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని ముందుకు వెళ్తుండాలి అంతేకాని ఇలా ముభావంగా ఉండకూడదు" అని బాబు, గంటాకు ఫోన్ లో ధైర్యం చెప్పినట్టు తెలుస్తుంది.. దీంతో గంటా అలక వీడి సీఎం పర్యటనలో పాల్గొనడానికి ఒప్పుకున్నారు.