బాబుకి ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలీదు.. కార్యకర్తల ఆవేదన

 

"మోసానికి పునాది నమ్మకం. కానీ, మనం ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో కరెక్ట్ గా తెలిస్తే.. మనం మోసపోము. సరైన వ్యక్తులను నమ్మితే విజయం మన వైపే ఉంటుంది." అసలిప్పుడు సడెన్ గా నమ్మకం గురించి ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బాధలో ఉన్న టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నమ్మకం గురించి తెగ చర్చించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు కాస్త వింతగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయట. వెన్నుపోట్లకు పాల్పడకుండా నిజాయితీగా పార్టీకి అంకితమై పనిచేసే నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు అసలు నమ్మరంట. ఆయన కోసం, పార్టీ కోసం మంచి చేద్దామనుకునే వారిని కనీసం దగ్గరికి కూడా రానివ్వరట. అవినీతిపరులు, మాయమాటలతో మభ్యపెట్టే వారు, స్వార్థ రాజకీయాలు చేసేవారు, ఆహా ఓహో అంటూ నిత్యం డప్పుకొట్టే వారు.. ఇలాంటివారినే నమ్ముతూ చంద్రబాబు తన చుట్టూ వీరినే ఉంచుకుంటారట. 

నిజానికి ఇలాంటి ఆరోపణలు బాబుపై ఎప్పటినుంచో వస్తున్నాయి. బాబు ఇకనైనా మారతారని కార్యకర్తలు ఎదురుచూస్తూ వస్తున్నారు. కానీ ఏళ్ళు గడిచినా బాబు తీరు మారలేదు. 'నిజాయితీపరులైన కార్యకర్తలే నా ప్రాణం. వారి కష్టాల్లో పాలు పంచుకుంటాను' అని మాటలకే బాబు పరిమితమయ్యారనే విమర్శ కూడా ఉంది. వలసదారులు, స్వార్థ రాజకీయ నాయకులకే చంద్రబాబు పెద్ద పీట వేశారని.. కానీ వారు వెన్నుపోటు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు మూలంగానే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ అంత దారుణంగా ఓడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోకపోయినా, చిన్న చూపు చూసినా.. కొందరు నేతలు, కార్యకర్తలు ఆయనకు విశ్వాసపాత్రులుగానే ఉంటున్నారు. పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకపోయినా.. నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ జెండాని వదలట్లేదు. కానీ చంద్రబాబు ఇలాంటి వారిని నమ్మకుండా.. మాటలు చెప్తూ పబ్బం గడిపే వారినే నెత్తిన పెట్టుకుంటున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వార్థం కోసం అధికారంలో ఉన్నంత కాలం పక్కన చేరి డప్పు కొట్టి, తరువాత పార్టీని వీడే వారిని కాకుండా.. గెలిచినా, ఓడినా పార్టీకోసం పనిచేస్తూ నిజాయితీగా ఉండేవారిని బాబు నమ్మితే పార్టీకి ఇలాంటి పరిస్థితి రాదని అభిప్రాయపడుతున్నారు. బాబు ఇప్పటికైనా సరైన వ్యక్తులను నమ్మి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టాలని కోరుతున్నారు.