నువ్వొస్తే ఓట్లు పోతాయని బెదిరించారు

 

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సత్తుపల్లి టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..సమయం లేకపోయినా సండ్ర వెంకటవీరయ్య విజయం కోసం సత్తుపల్లి వచ్చానని,నీతీ నిజాయితీకి సండ్ర మారుపేరని అన్నారు.  15 మంది గెలిస్తే 14మంది పార్టీ మారిపోయినా సండ్ర వెంకటవీరయ్య మాత్రం ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా టీడీపీలోనే కొనసాగారని తెలిపారు.

తెలంగాణలో  టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటు బ్యాంకు, క్యాడర్‌ బలంగా ఉన్నాయని.. ఈ రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసి తెరాసకు డిపాజిట్లు రాకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. "తెరాసను భవిష్యత్తులో కనుమరుగయ్యేలా చేయాలి. ఈ ఎన్నికలే కేసీఆర్‌కు చివరి ఎన్నికలు కావాలి. కేసీఆర్‌ అస్తవ్యస్త విధానాల వల్ల తెలంగాణ బాగా దెబ్బతింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్రంలో కేసీఆర్‌ ఒక్క పని కూడా చేయలేదు. రాష్ట్రంలో అద్భుతంగా ఫాం హౌజ్‌ కట్టుకోవడమే ఆయన చేసిన ఏకైక పని. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా అందులోనే కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటారు. ఈసారి గెలిచేది ప్రజా కూటమే. ఇందులో అనుమానమే లేదు.’

"సత్తుపల్లిని ఎందుకు జిల్లా కేంద్రం చేయలేదో నాకు అర్థం కావడం లేదు. సింగరేణి కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు పోలవరం తరహాలో ప్యాకేజీ అందించే బాధ్యత మహా కూటమి తీసుకుంటుంది. మీడియా ప్రతినిధులకు కూడా ఇళ్లు కట్టించే బాధ్యత ప్రజా కూటమిదే. ఏపీలో లాగా పాత్రికేయులకు జీవిత బీమా, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అశ్వారావుపేటలోని బహిరంగసభకు కేసీఆర్‌ వచ్చినప్పుడు తెరాస అభ్యర్థినే వేదికపైకి రావొద్దని.. నువ్వొస్తే ఓట్లు పోతాయని బెదిరించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా అంతే కదా..! రేవంత్‌ రెడ్డి ఇంట్లో రాత్రి 3 గంటల సమయంలో ఆయన బెడ్‌రూంలోకి పోలీసులు ప్రవేశించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఈ ఘటనపై హైకోర్టే ప్రశ్నించిందంటే.. ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోందో అర్థం చేసుకోవచ్చు. .’’ అని చంద్రబాబు అన్నారు.

లగడపాటి రాజగోపాల్‌ వెల్లడించిన తెలంగాణ ఎన్నికల సర్వేపై కూడా చంద్రబాబు స్పందించారు. లగడపాటి సర్వే సైతం మహాకూటమి విజయం తథ్యమని చెప్పిందన్నారు. ఇక తెరాస పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. రెండున్నర నెలల క్రితం లగడపాటి చేసిన సర్వే ప్రకారం తెరాసకు 90 సీట్లు వస్తాయంటే ఆనందపడిన కేసీఆర్‌.. ఇప్పుడు తెరాస ఓడిపోతుందని చెబితే ఆయనపై విమర్శలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.