ఎమ్మెల్సీ ఫలితాలు.. చంద్రబాబుకు జగన్ సవాల్..

 

స్ధానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కర్నూల్, కడప, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పై పోటీ చేసిన టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక ఈ ఎన్నకల ఫలితాలపై స్పందించిన వైసీపీ అధినేత టీడీపీపై పలు విమర్శలు గుప్పించిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుకు ఓ సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయంగా భావిస్తే, పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాలని,  ఆ ఎన్నికల ఫలితాలను తాము రెఫరెండంగా స్వీకరిస్తామని, ఇందుకు ఆయన సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఇచ్చి కొనుగోలు చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. మరి చంద్రబాబు జగన్ సవాల్ ను స్వీకరిస్తారో.. లేదో చూడాలి.