చంద్రబాబు ఇమేజ్ తగ్గుతోందా!

 

నిన్న కర్ణాటకలో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారం ప్రాంతీయ పార్టీలన్నింటికీ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమానికి హాజరై అంతా లాభపడినట్లే కనిపించారు. కానీ చంద్రబాబు మాత్రమే కాస్త చిక్కుల్లో పడ్డారేమో అన్నది విశ్లేషకుల అంచనా. రాహుల్‌గాంధితో కలిసి చంద్రబాబు నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడిన ఫొటోలని ప్రతిపక్షాలు బాగానే ఉపయోగించుకుంటున్నాయి. మొన్నటివరకూ బీజేపీతో జతపట్టి రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టిన బాబు, ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌తో కలిసి అదే తప్పు చేస్తున్నారని దుయ్యపడుతున్నారు. ఇలాంటి విమర్శలు వస్తాయనే కేసీఆర్‌ తెలివిగా ఓ రోజు ముందే వెళ్లి కుమారస్వామిని కలిసివచ్చారు. కాంగ్రెస్ మీద కసితోనే ఆవిర్భవించిన తెదెపా కూడా ఇలాంటి వ్యూహమేదో పాటిస్తే బాగుండేది. కానీ వేదిక మీద చంద్రబాబు బాడీలాంగ్వేజ్‌ కోరి విమర్శలు తెచ్చుకొంది.

 

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కూడా తన దూకుడిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు మేధావి, అనుభవజ్ఞుడు అంటూ కితాబిచ్చిన నోటితోనే చంద్రబాబుని ఏకేస్తున్నారు. ఆయన మాట మీద నిలబడటం లేదనీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేశారనినేరుగానే విమర్శిస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితల సమస్యలని కనుక తీర్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిస్తున్నారు. పవన్‌ హెచ్చరికలు ఎప్పుడెలా ఉంటాయో, ఎంత దూరం వెళ్తాయో అంచనా వేయడం కష్టం. ఇది ఖచ్చితంగా చంద్రబాబుని చికాకుపెట్టి తీరుతాయి.

 

ఇక వైసీపీ ఈసారి తెలివిగా వెంకన్నబాబుని రాజకీయంలోకి లాగింది. ఏకంగా రమణదీక్షితులులాంటి సెలబ్రెటీ స్టేటస్‌ ఉన్న అర్చకుడిని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పింది. వెంకటేశ్వరుని ఆభరణాలు చంద్రబాబే దొంగిలించారంటూ ప్రచారం చేస్తోంది. ఈ విషయాలను ప్రజలు నమ్మకపోయినప్పటికీ, ఎక్కడో ఏదో మతలబు జరుగుతోందనే అనుమానాన్ని కలిగించడంతో మాత్రం విజయం సాధించింది. అసలే ప్రత్యేక హోదాని రప్పించలేక, నూతన రాజధానిని నిర్మించలేక కష్టాల్లో ఉన్న చంద్రబాబు మీద ఇవన్నీ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి రాజకీయ చతురతలో ఆరితేరిపోయిన బాబు వీటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి!