కేంద్రానికి టీటీడీ వివాదం.. చంద్రబాబు ప్రభుత్వానికి కష్టమేనా...!

 

తిరుమల తిరుపతి దేవస్థానం పై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికి చిలికి పెద్ద తుఫానుగా మారేలా కనిపిస్తోంది. అంతేకాదు.. చూడబోతే ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వం కూడా ఇరుకునపడే పరిస్థితి వస్తుందేమో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకే కుదిస్తూ టిటిడి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిపై రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రమణదీక్షితులు పింక్ డైమండ్ తో పాటు టిటిడిలో చోటు చేసుకొంటున్న విషయాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికితోడు... పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి టిటిడి ఆభరణాలు కొన్ని కన్పించకుండా పోయాయని ఆరోపించారు. 2011లో తాము ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. శ్రీకృష్ణ దేవరాలయాల కాలం నుండి శాసనంలో ఉన్న ఆభరణాలు ,ఇతర వస్తువులు లేవని ఆయన చెప్పారు.అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు టిటిడి ఆభరణాలను భద్రపర్చేందుకు కమిటీని ఏర్పాటు చేసి జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఇక మొత్తంగా టిటిడిలో పరిణామాలు టిటిడి పాలకవర్గంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు ఈవో సింఘాల్ తో సమీక్ష నిర్వహించారు.

 

ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపై రమణదీక్షితులు ఎలా విమర్శలు గుప్పిస్తారని చంద్రబాబునాయుడు రమణదీక్షితులు వ్యవహరంపై ప్రశ్నించారని సమాచారం. ఇక సమీక్ష ముగిసిన తరువాత సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. టిటిడిలో శ్రీవారి నగలన్నీ సురక్షితంగానే ఉన్నాయని.. టిటిడి నిధులు ఎక్కడ కూడ దుర్వినియోగం కాలేదని ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయడు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. ఆగమశాస్త్రం ఒప్పుకొంటే శ్రీవారి నగలను ప్రదర్శిస్తామని... నగలను ప్రదర్శించేందుకు తాము సిద్దంగా ఉన్నామని... 1952 నుండి కూడ స్వామివారికి ఉన్న నగల జాబితాకు సంబంధించిన రికార్డులున్నాయని ఆయన చెప్పారు. 2011లో రిటైర్డ్ జడ్జిల కమిటీ ప్రకారంగా నగలు ఉన్నాయని... అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏ నగలు ఇచ్చారనే విషయాన్ని రిటైర్డ్ జడ్జిల కమిటీ తేల్చలేదన్నారు.

 

 

మొత్తానికి ఈ వ్యవహారం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇక కేంద్రం వరకూ ఈ వ్యవహారం వెళ్లడంతో ఏం జరుగుతుందా అని  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలే కేంద్రానికి.. చంద్రబాబు చెడింది... ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..