సారీ... ఒక్కసారి ఓకే! ప్రతీసారీ చెల్లదు...

 

ఒకసారి అధికారంలోకి రావటం వేరు. ఆ అధికారాన్ని అయిదేళ్ల తరువాత కూడా నిలబెట్టుకోవటం వేరు! రెండో పని సర్కస్ లో  తాడు మీద నడవటం లాంటి సాహస కృత్యం! అందరి వల్లా కాదు. అందుకే, చాలా రాష్ట్రాల్లో , కేంద్రంలో కూడా ప్రతీ అయిదేళ్లకు అదికారం చేతులు మారిపోతుంటుంది. అందుకు కారణాలు బోలెడు! మరీ ముఖ్యంగా, భారతదేశంలో కేవలం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటేనే అధికారం కోల్పోతామని గ్యారెంటీ లేదు. ఒక్కోసారి హామీలు నెరవేర్చకపోయినా జనం అందలం ఎక్కిస్తారు. కాని, కొన్ని అత్యంత కీలకమైన విషయాలు మాత్రం ఫలితాల్ని తారుమారు చేసేస్తుంటాయి!

 

సమైక్యాంధ్రప్రదేశ్ ను అత్యంత సుదీర్ఘ కాలం పాలించిన సీఎంగా చంద్రబాబు రికార్డ్ సృష్టించారు. కాని, ఆయన 2004లో ఓడిపోయినప్పుడు కారణం ఏంటి? కరువు, రైతుల బాధలు వగైరా వగైరా వున్నప్పటికీ మరో ముఖ్య కారణం కూడా వుంది. అదే... ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత. కారణాలు ఏమైనా చంద్రబాబు మీద అప్పట్లో ఉద్యోగులు, అధికారులు గుర్రుగా వుండేవారు. అది కూడా వైఎస్ విజయానికి దోహదం చేసిందని కొందరు రాజకీయ పండితులు విశ్లేషించారు! అది ఎంత వరకూ నిజమో చెప్పలేం...

 

గతంలో బాబుకి ఉద్యోగుల సెగ తగిలిందో లేదో మనకు తెలియదు కాని... ఇప్పుడు మాత్రం ఆయన జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే! ఎందుకంటే, కొత్తగా ఏర్పడ్డ ఏపీ కోసం గవర్నమెంట్ ఉద్యోగులు హైద్రాబాద్ వదిలి వచ్చారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి విడిచి వచ్చి అమరావతిలో ఇక్కట్లు పడుతున్నామని వారి భావన. రాష్ట్రాభివృద్ధి కోసం వాళ్లు అలా చేయాల్సిందే. వేరే మార్గం లేదు. కాని,అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఉద్యోగులు, అధికారులు చేస్తున్న శ్రమని గుర్తించి మసులు కోవాలి. అలా కాకుండా వారిపై అనవసర ఒత్తిడి పెంచితే ఎన్నికల సమయంలో అనూహ్య ఫలితాలు రావచ్చు. ఒక్కోసారి జనం మన వైపు వున్నా ప్రభుత్వానికి జవసత్వాల్లాంటి ఉద్యోగులు సహకరించకుంటే సీఎం, మంత్రులు చేయగలిగింది ఏం లేదు!

 

విజయవాడలో రవాణశాఖ కమీషనర్ తో టీడీపీ నేతల వాగ్వాదం ఎంత మాత్రం సరైంది కాదు.ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ మూకుమ్మడిగా అధికారిని టార్గెట్ చేయటం చాలా తప్పుడు సంకేతాల్ని పంపుతుంది ప్రభుత్వ యంత్రాంగానికి. నిజంగా అధికారి తప్పే వున్నా హ్యాండిల్ చేసే పద్ధతి అలా వుండకూడదు. రూల్స్ ప్రకారం ఆఫీసర్ లని ప్రశ్నించే హక్కు ప్రజాప్రతినిధులకి వుంటుంది. ఇక తాజాగా జరిగిన ఉదంతంలో అయితే టీడీపీ నేతలదే తప్పని చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యారట. ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం టీడీపీ నేతల ప్రవర్తన సరిగ్గా లేదని నిర్ణయించుకున్నాకే వాళ్లని పిలిచి క్లాస్ తీసుకున్నారట సీఎం. ఆయన ఆదేశంలో టీడీపీ నాయకులు కమీషనర్ కి సారీ చెప్పటంతో సమస్య ఇప్పటికైతే సద్దుమణిగినట్టే!

 

రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక అధికారితో నాయకుల గొడవ పెద్ద విషయం కాకపోవచ్చు. కాని, అధికారంలో వున్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కువైతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. అదీ కాక ప్రతిపక్ష నేత జగన్ కూడా పలు సందర్బాల్లో అధికారులపై నోరు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో వాళ్లలో భరోసా కల్పించాల్సిన అధికార పక్షం దురుసుగా, దూకుడుగా ప్రవర్తిస్తే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి, సీఎంగా, అధికార పార్టీ నాయకుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తోన్న చంద్రబాబు ముందు ముందు మరింత అలెర్ట్ గా వుండాలి. నిప్పు రాజుకున్నాక ఫైర్ ఫైటింగ్ చేయటం కన్నా... ముందే ఫైర్ సేఫ్టీ పాటిస్తే మంచిది!