ఒక పరాజయం 100 తప్పులు.. కేసీఆర్ బాటలో నడవబోయి బోర్లాపడ్డ బాబు

 

ప్రస్తుతం దేశంలో ఉన్న నాయకుల్లో తానే సీనియర్ ని అని.. మిగతా రాష్ట్రాల సీఎంలు, ప్రధాని మోడీ కూడా తన జూనియర్లేనని చెప్పుకునే చంద్రబాబు.. సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అయి ఫెయిల్ అయ్యారా అంటే అవునని చెప్పక తప్పదు. ఎంతో అనుభవం ఉన్న బాబు.. అభివృద్ధిలో పోటీ పడాల్సింది పోయి, కేసీఆర్ ని అనుకరించి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. కేసీఆర్ ఇతర పార్టీల నేతలను చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు. కేసీఆర్ సంతలో పశువుల్ని కొన్నట్లు నాయకులను కొంటున్నారని తెలంగాణలో కేసీఆర్ తీరుని తప్పుబట్టిన టీడీపీ.. తీరా ఏపీలో ఆయన్నే ఫాలో అయింది. బాబు వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇక కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కి ఏ మంత్రిత్వ శాఖను కట్టబెట్టారో.. ఏపీలో అదే శాఖను బాబు తన తనయుడు లోకేష్ కి కట్టబెట్టారు. అయితే కేటీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి కొట్టేసారు. దీంతో బాబు, లోకేష్ లపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

ఇవే కాదు పథకాల విషయంలోనూ బాబు కేసీఆర్ ను అనుకరించారు. కేసీఆర్ 'రైతు బంధు' పథకాన్ని తెలంగాణలో తీసుకొస్తే.. ఏపీలో బాబు 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని తీసుకొచ్చారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో రైతుబంధు వల్లే గెలిచారు. తాను కూడా ఏపీలో అలాగే గెలుస్తానని బాబు భావించారు. కానీ ఓడిపోయారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రాంతీయ సెంటిమెంట్ రగిలిస్తే.. బాబు కూడా ఏపీలో అదే ఫాలో అయ్యారు. టీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ కాబట్టి ప్రాంతీయ సెంటిమెంట్ కేసీఆర్ కు వర్కౌట్ అయింది. కానీ తెలుగు ప్రజల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ.. ప్రాంతీయ సెంటిమెంట్ ని తీసుకురావడాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇలా పలు విషయాల్లో కేసీఆర్ ని ఫాలో అయిన బాబు.. తాను కూడా కేసీఆర్ లాగా రెండోసారి సీఎం అవుతాను అనుకున్నారు. కానీ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.