భవన నిర్మాణ కార్మికుల కోసం బాబు దీక్ష.. ఇసుక కొరతపై పోరాటం 

 

గత కొద్దిరోజులుగా ఆంధ్రా రాజకీయాలు ఇసుక చుట్టూ తిరువుతున్నాయి.. చెప్పాలంటే ఇసుక రాజకీయంగా మారింది అని కూడా అనుకోవచ్చు. ఇసుక కొరతను పరిష్కరించడమే కాకుండా చనిపోయిన కార్మికుల కుటుంబాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌ వద్ద నేడు చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. ధర్నాచౌక్‌లో చంద్రబాబు దీక్ష కోసం భారీగా ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు స్వయంగా దీక్ష ఏర్పాట్లను ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా   పర్యవేక్షించారు.

గత ప్రభుత్వాలు చేసిన తీరుగా ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ నేపధ్యంలో పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కొరత వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు 10వేల చొప్పున భృతి అందించాలని కూడా బాబు డిమాండ్లల్లో పేర్కొన్నారు.

విశాఖలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు టీడీపీ మద్దతు ఇచ్చిన తెలిసిందే.. అలా చూస్తే ఇసుక సమస్యపై టీడీపీ రెండోసారి ఆందోళన చేస్తుందనే అనుకోవాలి. ప్రత్యేకంగా బాబు గారు ఎందులో పాల్గొనకపోయినా పార్టీ నేతలను పంపారు. ఇలా దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు చంద్రబాబు. ఇక ఇదంతా జరిగేపని కాదు అని నేడు తానే స్వయంగా దీక్షకు దిగారు. చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతు తెలపమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కోరారు టీడీపీ నేతలు. ముందులానే దీక్షకు బీజేపీ సంఘీభావం తెలపింది.. ఇక ప్రత్యక్షంగా పవన్ హాజరు కాకపోయినా తన ప్రతినిధుల బృందాన్ని పంపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.