ఒక పరాజయం 100 తప్పులు.. నాశనం చేసిన బాబు 'నేనే' మంత్ర జపం

 

ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ విషయం ప్రజలకు తెలుసు. ఆ విషయాన్ని ప్రజలు చెప్తే బాబుకి కూడా గౌరవంగా ఉంటుంది. కానీ బాబు.. హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేశా, హైదరాబాద్ ని నేనే ప్రపంచపటంలో పెట్టా, అన్నీ నేనే చేశా అంటూ పదేపదే చెప్పుకోవడంతో.. ఉన్న గౌరవం పోయి నవ్వుల పాలయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయన నేను అనే మాటని వదల్లేదు. ఆ పని నేనే చేశా, ఆ ప్రాజెక్ట్ నేనే తెచ్చా ఇలా అన్నీ నేనే నేనే అంటూ పదేపదే చెప్పి చులకన అయిపోయారు. ఆయన నిజంగానే ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ ఆయన పదేపదే నేనే చేసానని చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఆయన నిజంగానే ప్రజలకోసం చేస్తే.. ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు, గెలిపిస్తారు. కానీ ఇలా పదేపదే నేనే అనడం వల్ల విపక్షాలు దాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రజల్లో ఆయన్ని చులకన చేసాయి. ఇప్పుడు ఆయనే విపక్షానికి పరిమితం అయ్యారు.

ఎన్నికల ముందు కూడా బాబు నేనే మంత్రాన్ని జపించారు. ఒకవైపు ప్రజల్లో పలువురు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే.. బాబు ఆ విషయాన్ని పట్టించుకోకుండా నన్ను చూసి ఓటేయండి, అన్ని నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని అనుకోని ఓటేయండి అని చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు మాత్రం స్థానికంగా ఉండేది ఎమ్మెల్యేలే కదా అని వారిని ఓడించి ఇంటికి పంపారు. బాబుని ప్రతిపక్షానికి పరిమితం చేసారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా నిర్లక్ష్యం చూపారు. అన్నింటికి బాబు నేనున్నా, అన్ని నేనే అంటున్నారుగా అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు ఓడిపోయారు, పార్టీని ఓడించారు. మొత్తానికి బాబు నేనే మంత్ర జపం.. ప్రజల్లో చులకన భావనతో పాటు, పార్టీకి ఓటమిని కూడా రుచి చూపించింది.