టీడీపీ ఘోర ఓటమికి ఖచ్చితంగా బాబే కారణం

 

ఏపీలో టీడీపీ పరాజయం పాలైంది. కాదు కాదు.. ఘోర పరాజయం పాలైంది. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఓటమి బాధ్యత మాత్రం ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబుదే అవుతుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బాబు పార్టీ శ్రేణులు క్రమశిక్షణ తప్పుతుంటే చోద్యం చూస్తూ ఉండిపోయారు. దాని ఫలితంగా పార్టీ పునాదులే కదిలే ప్రమాదం ఎదురైంది.

టీడీపీని బాబు పూర్తిగా తన అదుపాజ్ఞల్లోనే నడిపారు. ప్రతీ చిన్న విషయాన్ని తనే లీడ్ చేశారు. కానీ ఘోర పరాజయం ఎదురైంది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపైనే దృష్టిన పెట్టిన బాబు.. పార్టీలో పరిస్థితులు కంట్రోల్ తప్పుతున్నా, నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినా, వివాదాల్లో ఇరుక్కున్నా.. హెచ్చరించి పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేయలేదు. టీడీపీ శ్రేణుల్లో కొందరు.. పదేళ్ల తర్వాత అధికారం వచ్చిందన్న ఉత్సాహంలో.. ప్రజల కన్నా తామే ఉన్నతం అన్నట్లుగా వ్యవహరించారు. జన్మభూమి కమిటీలు లాంటివి కొందరి సొంత కమిటీలుగా మారిపోయాయి. ఈ విషయాలన్నీ బాబుకు చేరుతున్నా.. కట్టడి చేసే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. దాంతో అసలుకే మోసం వచ్చింది. పార్టీ నేతలను కంట్రోల్ చేయకపోవడంతో.. క్షేత్ర స్థాయిలో అసంతృప్తి పెరిగిపోయింది.

ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పుడు.. ఒక ఏడాది ముందు మాత్రమే.. బాబు పార్టీపై దృష్టి పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత కూడా ఆ నష్టాన్ని కవర్ చేసే ప్రయత్నం చేయలేదు. అంతే మొండిగా ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడిలా ఘోర ఓటమి చవిచూశారు. ధర్మపోరాట సభలకు ఇచ్చిన ప్రయారిటీ పార్టీకి ఇవ్వలేదు. అది పరిస్థితుల్ని మరింత దిగజార్చింది. ఓ రకంగా బాబు అదుపు తప్పుతున్న పార్టీ మీద అదుపు కోల్పోయారనే చెప్పాలి. చివరికి బాబు పోల్ మేనేజ్‌మెంట్ కూడా సరిగ్గా చేసుకోలేకపోయారు. ఈ విషయం పోలింగ్ రోజు స్పష్టమయింది. టీడీపీ హైకమాండ్ కు కూడా అదే నివేదికలు వచ్చాయి. పోల్ మేనేజ్ మెంట్‌లో కింగ్ అని చెప్పుకునే బాబు కూడా.. ఈ పరిస్థితి ఊహించి ఉండరు. ఆ స్థాయిలో టీడీపీ యంత్రాంగం ఫెయిలయింది. చంద్రబాబు అంతా తానే చేయాలనుకోవడం, బాధ్యతలను వికేంద్రీకరించకపోవడం, అదుపుతప్పుతున్న పార్టీ శ్రేణుల్ని కంట్రోల్ లో పెట్టకపోవడంతో అసలుకే మోసం వచ్చింది. ఘోర ఓటమి ఎదురైంది. ఈ ఓటమికి ఖచ్చితంగా బాబే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఓటమి సాదాసీదాది కాదు. పార్టీ పునాదుల్ని కదిలించే అంతటి ఓటమి. ఈ ఓటమి పాఠాలు, తన అనుభవంతో బాబు టీడీపీకి పునర్వవైభవం తెచ్చే అడుగులు వేస్తారేమో చూడాలి.