ఏపీకి మూడు రాజధానులు... జగన్ వ్యూహంలో చిక్కి విలవిల్లాడుతున్న చంద్రబాబు!!

ప్రస్తుతం ఏపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. నిజంగానే రాజధాని మూడు ముక్కలు కానుందా అని ఏపీలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. అసలు ఈ రాజధాని సెగ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉంది. వైఎస్ జగన్ సీఎం అయితే రాజధానిని అమరావతి నుండి మారుస్తారని టీడీపీ ఎన్నికల ముందే ఆరోపించింది. కానీ వైసీపీ మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేసింది. తీరా ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చాక.. కొద్దిరోజులకే రాజధాని గురించి ట్విస్ట్ లు ఇవ్వడం మొదలుపెట్టింది. మొదటగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని సెగకు ఆజ్యం పోశాయి. రాజధానికి అమరావతి సరైన ప్లేస్ కాదని, స్మశానంతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజధానిపై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత కూడా పలువురు వైసీపీ నేతలు అమరావతి గురించి అటువంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇక తాజాగా సీఎం జగన్ కూడా అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టే జీఎన్ రావు కమిటీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో మూడు చోట్ల రాజధాని ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక అమరావతి ప్రాంతంలో అయితే తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం మూడు చోట్ల రాజధాని అనేది అసాధ్యమని.. ఈ మూడు రాజధానుల వ్యాఖ్యల వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని అభిప్రాయపడుతున్నారు.

జగన్ టీడీపీని, చంద్రబాబుని దెబ్బకొట్టి.. ఏపీలో అసలు టీడీపీ మనుగడే లేకుండా చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దానికోసం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్ములాని ఫాలో అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా చంద్రబాబును, టీడీపీని ఎంత ఇరుకున పెట్టారో అందరికీ తెలుసు. జై సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో పార్టీకి నష్టం, జై తెలంగాణ అంటే ఆంధ్రాలో పార్టీకి నష్టం అనే విధంగా ఎత్తుగడలు వేశారు. టీడీపీ అంటే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసేలా ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చారు. కేసీఆర్ దెబ్బకి ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. ఇప్పుడదే ఫార్మూలాను జగన్‌ కూడా అప్లై చేయనున్నారని తెలుస్తోంది. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేస్తూ… అమరావతిలో రాజధాని ఉంటూనే, కర్నూల్‌తో పాటు విశాఖను కూడా రాజధానిగా చేయబోతున్నాం అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిణామం ఎదురవుతోంది. విశాఖకు రాజధాని వద్దు అంటే.. ఉత్తరాంధ్రలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కర్నూల్‌కు హైకోర్టు వద్దని అంటే రాయలసీమలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే.. జగన్ ఒక్క ప్రకటనతో రెండు ప్రాంతాల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించారు. ఓ రకంగా ఇది టీడీపీ మనుగడకే ప్రమాదం. పోనీ ఈ విషయాన్ని గుర్తించి..  జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించినా కూడా టీడీపీకే నష్టం. జగన్ నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు మరి మీరు అప్పుడు రాజధాని అమరావతిలో ఒక్క చోటే ఎందుకు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తారు? ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఇక.. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీ మీద వ్యతిరేకత రాదేమో కానీ.. ఆ ప్రాంతాల ప్రజలు మాత్రం జగన్ కే జై కొడతారు. ఎందుకంటే నిర్ణయం జగన్ దే కదా. ఇలా ప్రాంతీయ విభేదాలు, సెంటిమెంట్ తో చంద్రబాబుని ఇరుకున పెడుతున్నారన్నమాట. మొత్తానికి జగన్.. చంద్రబాబుని, టీడీపీని దెబ్బకొట్టడానికి.. కేసీఆర్ వాడిన 'ముందు నుయ్యి.. వెనక గొయ్యి' ఫార్ములాని వాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్ మూడు రాజధానుల వ్యాఖ్యల వెనుక కొందరు మరోకోణం కూడా ఉందంటున్నారు. జగన్ వైసీపీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాలనే ఈ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. రాయలసీమలో వైసీపీకి మంచిపట్టుంది. ఇప్పుడు కర్నూల్ లో హైకోర్టు ప్రకటనతో.. రాయలసీమలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశముంది. ఉత్తరాంధ్రలో వైసీపీ అంతగా బలంగా లేదు. ఇప్పుడు విశాఖలో రాజధాని ప్రకటనతో.. ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభ పెరిగే అవకాశముంది. ఇక అమరావతిలో ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను అడ్డుకోవడానికి కుల రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. అమరావతిలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు వందలు, వేల ఎకరాల్లో భూములు కొన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. నిజానికి వ్యాపారాలు చేయడం, స్థలాలు కొనడంలో ఎప్పుడూ ఒకటిరెండు కులాలే ముందుంటాయి. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టినా వారే ముందుంటారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూడా స్థలాలు కొని వ్యాపారాలు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ వైసీపీ మాత్రం ఒక్క కులానిదే రాజధాని అని ఆరోపిస్తోంది. వైసీపీ ఆరోపిస్తున్నట్టు.. 20 శాతం స్థలం ఒక కులం చేతిలో ఉందనుకున్నాం.. మరి మిగతా 80 శాతం స్థలం ఎవరి చేతిలో ఉంది?. అది ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే అసలు ఆ ఆలోచనే రాకుండా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దానిద్వారా మిగతా కులాలకు దగ్గరవ్వాలని చూస్తోంది. అంటే మూడు రాజధానుల ప్రకటనతో మూడు ప్రాంతాల్లోనూ టీడీపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు చోట్ల ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం, ఒక చోట కుల రాజకీయం చేయడం ద్వారా అసలు టీడీపీ మనుగడకే ప్రమాదం తీసుకొస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని కథ ఇంతటితో ముగియలేదు. మూడు చోట్ల రాజధాని ఏర్పాటు చేయడం అంత సులభం కాదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టంలో రాజధాని ఎంపిక అధికారం మొదటి సీఎంకి ఉంటుందని స్పష్టంగా ఉంది. విభజన తరువాత ఏపీ మొదటి సీఎం గా చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అసెంబ్లీ తీర్మానం జరిగింది. కేంద్రం అంగీకారం తెలిపింది. ప్రధాని అమరావతిలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అక్కడ పలు నిర్మాణాలు కూడా జరిగాయి. మరిప్పుడు మూడు చోట్ల రాజధాని అంటే రాజ్యాంగపరంగా చిక్కులు వచ్చే అవకాశముంది. కేంద్రం కూడా అంగీకరించకపోవచ్చు. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్పు అంటే రాష్ట్ర మనుగడకే ప్రమాదం అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు. అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్ ఇలా వేరు వేరు చోట్ల అంటే పాలకుల నుండి ప్రభుత్వ అధికారుల వరకు అందరికి ఇబ్బందే. దీనిబట్టి ఆలోచిస్తే మూడు రాజధానుల అంశం కేవలం ప్రకటనకు పరిమితమైనా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ మూడు రాజధానులు ఆచరణ సాధ్యం కాకపోయినా.. జగన్ చంద్రబాబుని ఇరుకున పెట్టగలరని అంటున్నారు. ఎందుకంటే మూడు రాజధానుల కోసం నేను కృషి చేశాను.. కానీ చంద్రబాబే వ్యతిరేకించి ఆచరణ సాధ్యం కాకుండా చిక్కులు సృష్టించారని చెప్పే అవకాశముంది. ఇలా ఏ కోణంలో చూసినా జగన్.. చంద్రబాబుని పక్కా ప్లాన్ ప్రకారం ఇరుకున పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. మరి దీని నుండి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి.