బీజేపీ, వైసీపీ లాలూచీ.. స్టింగ్‌ ఆపరేషన్‌ బయటపెట్టింది

 

ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ‘టైమ్స్‌ నౌ’ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారీ వైసీపీ, బీజేపీ మధ్య సీక్రెట్ దోస్తీ నడుస్తోందని ఒప్పుకున్న విషయం తెలిసిందే. బుధవారం దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. ఇరు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేనప్పటికీ.. పోటీ విషయంలో రహస్య అవగాహన ఉందని ఆ వీడియోలో మనోజ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలాంటి వారు పోటీచేసే చోట బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్నది తమ పార్టీ విధానమని మనోజ్‌ వెల్లడించారు.

స్టింగ్‌ ఆపరేషన్‌లో వైసీపీ, బీజేపీ పార్టీల మధ్య బంధం బయటపడిపోయిన నేపథ్యంలో.. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గురువారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, వైసీపీ లాలూచీని ‘టైమ్స్‌ నౌ’ స్టింగ్‌ ఆపరేషన్‌ బయటపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థులపై వైసీపీ బలహీన అభ్యర్థులను దించుతారని ఆ పార్టీ నేతే చెప్పారు. పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్‌ను బీజేపీ వాళ్లు దాసోహం చేసుకున్నారు. అక్కడేమో మోదీకి దాసోహైన ఆయన.. ఇక్కడ మాత్రం కేసీఆర్‌కు అయ్యారు. ఇలాంటి వైసీపీ రాష్ట్రానికి అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు.