ప్రజాస్వామ్యంలో చీకటి రోజు.. అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు!!

 

టీడీపీ పిలుపునిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. అయినా టీడీపీ వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అఖిలప్రియ, అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను ‘ఛలో ఆత్మకూరు’కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీరిలో కొందరిని హౌస్ అరెస్ట్ చేయగా, మరికొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసినంత మాత్రాన వైసీపీ సర్కారు చేస్తున్న తప్పులన్నీ ఒప్పులు కావని చంద్రబాబు అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో దీనిని ఒక చీకటి రోజు అని అభివర్ణించారు. పునరావాస శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా? బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

‘ఒక్కో టీడీపీ నేత ఇంటి ముందు ఇంత మంది పోలీసులను పెడతారా? బాధితులకు పోలీసులను అండగా ఉంచితే ఈ పరిస్థితి అసలు వచ్చేదా? సొంత ఊరిలో నివసించేందుకు టీడీపీ శ్రేణులు చేస్తున్న పోరాటం ఇది. సొంత భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఇది. బాధితులకు సంఘీభావంగా ప్రజలంతా అందరూ నిరసనల్లో పాల్గొనాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు రాష్ట్రమంతా శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని సూచించారు. బాధితులకు మద్దతుగా తాము చేస్తున్న పోరాటం ఆగదనీ, టీడీపీ డిమాండ్లను పరిష్కరించాల్సిందేని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రోజు రాత్రి 8వరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అందరూ దీక్షల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.