కులంతో కొరివెందుకు పెట్టుకున్నారు? టీడీపీ లీడర్లకు చంద్రబాబు చీవాట్లు

 

టెక్నికల్ గా ఎంత వాదించినా, క్రైస్తవ్యాన్ని అనుసరించినంత మాత్రానా, ఇష్టపడినంత మాత్రానా, సమాజంలో ఆయా వ్యక్తుల కుల గుర్తింపు మాత్రం అలాగే ఉంటుంది. కులం మారనే మారదు. ఒకవిధంగా చెప్పాలంటే క్రైస్తవ్యమనేది మతం మాత్రమే. కులం కాదు. ఒకప్పుడు ఒకట్రెండు కులాలకు మాత్రమే పరిమితమైన క్రైస్తవ్యాన్ని ఇప్పుడు అన్ని కులాల వాళ్లు అనుసరిస్తున్నారు. ఏదిఏమైనా పుట్టి పెరిగిన కులంతోనే సమాజం గుర్తిస్తుంది. అందుకు రుజువు ఎన్నో సంఘటనలున్నా, తాజాగా తాడికొండ వైసీపీ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో మరోసారి రుజువైంది. ఆమె అసలు మాదిగే కాదని, ఆమె క్రిస్టియన్ అంటూ రాజకీయంగా ఎంత ఎదురుదాడికి దిగినా, సమాజంలో ఆమె కుల గుర్తింపుతోనే, అవమానం జరిగిందనేని వాస్తవం. దళిత మహిళ పూజచేస్తే, వినాయకుడు మైలపడతాడంటూ కులం పేరుతో దూషించడంతోనే వివాదం రాజుకుంది.

అయితే, ఈ ఘటనపై టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించడం కూడా వివాదమైంది. టీడీపీ దళిత నేతలే... పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. శ్రీదేవి అసలు మాదిగే కాదని, క్రిస్టియన్ అంటూ జవహర్ ఎదురుదాడికి దిగితే.... మరోవైపు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాత్రం... దళిత ఎమ్మెల్యేను కులం పేరుతో దూషించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అయితే, పార్టీ లీడర్లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారట. పార్టీ నిర్ణయమేంటో చెప్పకుండా మీ ఇష్టమొచ్చినట్లు ప్రకటనలేంటని మండిపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దళిత ఎమ్మెల్యే శ్రీదేవి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారని తెలిసింది. అసలు కులం పేరుతో దూషించడమేంటంటూ స్థానిక నేతలను పిలిచి చీవాట్లు పెట్టారట. అసలే పార్టీ ఓడిపోయి కష్టాల్లో ఉన్న టైమ్ లో అసలు ఈ కులంతో కొరివెందుకు పెట్టుకున్నారంటూ క్లాస్ పీకారట. విధానపరంగా మాట్లాడాలే గానీ, ఇలా కుల పంచాయతీలు ఏమాత్రం మంచివికావంటూ సీరియస్ అయ్యారట. 

పార్టీ పుంజుకునేలా తాను ప్రయత్నాలు చేస్తుంటే, కిందిస్థాయి నేతలు మాత్రం ఇలా చిల్లర చేష్టలతో పార్టీ పరువు తీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారట. ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడి, ప్రజల మనసులు గెలుచుకోవాలని కేడర్ కు బాబు సూచించినట్లు తెలుస్తోంది.