ఢిల్లీ సాక్షిగా కేంద్రాన్ని ఉతికారేసిన చంద్రబాబు

 

ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని నిలదీయడానికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ మీడియా సాక్షిగా కేంద్రం తీరుపై నిప్పులుచెరిగారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలువురు నేతలతో భేటీ అయ్యి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేంద్రాన్ని నిలిదీసారు. దేశంలోని రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పిన చంద్రబాబు.. స్వయంగా ప్రధాని మోదీయే రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతోందో వివరించడానికే మీ ముందుకొచ్చాను అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు.  నల్లధనం వెనక్కి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. అలాంటిదేమీ ఏమీ జరగలేదు. ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో నగదు జమచేస్తామన్నారు.. ఏమైంది?. పెద్ద నోట్లు రద్దుచేస్తామని రూ.2వేల నోట్లు తీసుకొచ్చారు. కానీ, నోట్ల రద్దుతో దేశంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు ఆలోచన సరైంది కాదు. సరైన ప్రణాళిక లేకుండా అమలుచేశారు. దేశంలో బ్యాంకులన్నీ స్థైర్యం కోల్పోయాయి. వేల కోట్లతో నీరవ్‌ మోదీ, జతిన్‌ మెహతా, నితిన్‌ సందేశ్రా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. 2006తో పోలిస్తే ఆర్థిక వృద్ధి రేటు ఆశించినంతగా లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు? రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం చెప్పింది. ఎప్పుడు పూర్తి చేస్తారు? వ్యవసాయంలో 3శాతం వృద్ధి మాత్రమే ఉంది అని చంద్రబాబు అన్నారు.

కొత్తగా ఏర్పడిన ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కానీ, ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. విభజన హామీలు అమలు చెయ్యాలంటూ ఢిల్లీకి 29 సార్లు తిరిగానని కానీ స్పందించలేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వైసీపీ మద్దతును బీజేపీ తీసుకుంది. వైసీపీ, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కూడా వాపస్‌ తీసుకున్నారు. ఏపీకి సంబంధించిన డిమాండ్లు ఒక్కటీనెరవేర్చలేదు. తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో అక్కడ మీరు నిధులు ఇవ్వొచ్చు.. అది రాజకీయ కారణం. నేను అర్థంచేసుకోగలను. కానీ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని చంద్రబాబు అని ప్రశ్నించారు.

వైజాగ్ ఎయిర్‌పోర్టులో తాజాగా ఓ ఘటన జరిగిందని, ప్రతిపక్ష నేత జగన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ చిన్న కత్తితో దాడి చేశాడని తెలిపారు. ఈ విషయం తెలియగానే.. తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. ఎయిర్‌పోర్టులు కేంద్ర పరిధిలో ఉండే సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉంటాయని.. ఘటన జరిగింది ఎయిర్‌పోర్ట్ లోపలేనని చంద్రబాబు చెప్పారు. ఘటన జరిగిన అనంతరం దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతని వద్ద 10పేజీల లేఖ దొరికిందని ఆయన జాతీయ మీడియాకు వివరించారు. ఈ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు టీడీపీని విమర్శించారని చెప్పారు. అయితే ఘటన జరిగింది విమానాశ్రయం లోపల అని.. ఎయిర్‌పోర్ట్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుందని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం పరిధిలో ఉన్న చోట ఘటన జరిగితే తమను బాధ్యులను చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

మూడునాలుగు నెలల క్రితం శివాజీ ఆపరేషన్ గరుడ అనే ఓ అంశాన్ని తెరపైకి తెచ్చాడని.. మొదట్లో తాను నమ్మలేదని చంద్రబాబు చెప్పారు. ఆపరేషన్ గరుడలో శివాజీ ఏ అంశాలను వివరించాడో.. ప్రస్తుతం సరిగ్గా అదే మాదిరి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిణామాలతో తాను షాక్‌కు లోనయ్యానని చెప్పారు. దేశవ్యాప్తంగా రైడ్స్ జరుగుతాయని శివాజీ చెప్పాడని.. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అదే తరహాలో రైడ్స్ జరిగాయని తెలిపారు. తాము బీజేపీతో కలిసి ఉన్నన్నాళ్లు తమపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని, పొత్తు తెగతెంపులు చేసుకున్న అనంతరం ఐటీ దాడులు జరిగాయని చంద్రబాబు అన్నారు.