శీతాకాలం వేడెక్కుతున్న ఢిల్లీ రాజకీయం

 

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విడుదలకు ఒక్కరోజు ముందే ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. భాజపాకు వ్యతిరేకంగా మహాకూటమిగా రూపుదాల్చి నేడు  ఢిల్లీలో సమావేశం అవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గద్దె దించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఏకైక అజెండాతో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాన్ని సమన్వయపరుస్తున్నారు. భాజపాయేతర పక్షాల నేతలందరినీ ఆయన ఆహ్వానించారు.  ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పార్లమెంట్‌ అనెక్స్‌లో ఈ కీలక సమావేశం నిర్వహించనున్నారు.  గత నెల 22నే ఈ భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ... ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. నేటి సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబు పలువురు నాయకులను ఆహ్వానించారు. 


సమావేశంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, జేడీఎస్‌ నేత దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, డీఎంకే నేత స్టాలిన్‌, భారతీయ లోక్‌దళ్‌ నేత అజిత్‌సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యదవ్‌, జనతాదళ్‌ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌పవార్‌, ‘ఆప్‌’ అధినేత కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్‌ తనయుడుతేజస్వి యాదవ్‌ తదితర పార్టీల నాయకులు, పలువురు ఎంపీలు పాల్గొననున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా... రఫెల్‌ కుంభకోణం, సీబీఐ, ఈడీ, ఐటీ మొదలైన సంస్థల దుర్వినియోగం, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.