ఈవీఎంలపై అనుమానం.. వంద సీట్లలో 25వేల ఓట్లకు పైగా మెజార్టీ!!

 

అమరావతిలో శుక్రవారం టీడీపీ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి, 2024 ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భవించి 37 ఏళ్లు పూర్తయిందని, 9సార్లు ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. ఐదుసార్లు గెలిచామని, నాలుగుసార్లు ఓటమి చెందామని గెలుపు ఓటములన్నది సమానంగానే చూస్తామని.. నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడొద్దని కోరారు. కార్యకర్తలు, నేతలకు ధైర్యం ఇస్తున్నామని, ఈ ఎన్నికల్లో జరిగిన వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని 2024లో ఎదుర్కొనే ఎన్నికలకు ఇప్పటి నుంచే అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా నేతలను అభిప్రాయాలు వెల్లడించాలని చంద్రబాబు కోరారు.

ఈ సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపైనే అనుమానం ఉందని, బీజేపీ 300 సీట్లు గెలుస్తామని మొదటి నుంచి చెబుతున్నారని, ఇది ఎంతో సందేహించాల్సిన అంశమన్నారు. లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ ఎంపీలు గెలిచారని, అదే విధంగా రాష్ట్రంలో బీజేపీ సహకారంతో ఈవీఎంల వ్యవహారంతోనే వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారన్నారు. వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25వేల ఓట్లకు పైగా మెజార్టీ రావడంతో అనుమానాలున్నాయన్నారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలంతా హర్షించారని, ఎవరూ కూడా కోపంగా లేరని, ఈ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల పనితీరుపై పూర్తిస్థాయి పరిశీలన జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్‌ సర్కార్‌కు ఆరు నెలలు సమయం ఇద్దామని, తప్పు చేస్తే మనం విమర్శలు చేస్తే వారు సర్దుకుంటారని, ఆరు నెలలు లేదా సంవత్సరం సమయం ఇస్తే జగన్‌ పాలన ఏమిటన్నది ప్రజలకు తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఇసుక బంద్‌ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇలా జగన్‌ పాలన వైఫల్యాను ప్రజల్లోకి తీసుకుపోతామని మీ వెంటే ఉంటాం మీకు బాసటగా ఉంటాం అని శ్రీనివాసరెడ్డి జిల్లా తరఫున చంద్రబాబుకు హామీ ఇచ్చారు.