'చంద్రగిరి' పై చంద్రన్న కన్ను

 

ఏపీ సీఎం చంద్రబాబు స్వంతగ్రామం నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హేమాహేమీలైన నేతలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్యేగా చట్టసభలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎన్‌టీఆర్ స్థాపించిన తర్వాత జరిగిన 1983, 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చంద్రగిరిలో విజయం సాధించారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున గల్లా అరుణకుమారి నాలుగుసార్లు గెలుపొందారు. 2014లో ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి చంద్రగిరిని కైవసం చేసుకున్నారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరి పోటీచేసిన గల్లా అరుణకుమారిని ఆయన ఓడించారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరటంతో స్థానికనేతలు ఆమెకు సహకరించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమయ్యింది. దీంతో గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ దఫా ఎన్నికలపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. గత అనుభవం పునరావృతం కాకూడదని భావించారు. అందుకే చంద్రగిరిలో ముందస్తుగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు.  గల్లా అరుణకుమారి కూడా వచ్చేఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీచేయడానికి ససేమిరా అనటంతో కొత్త అభ్యర్థిని పోటీకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో అనేక కోణాల్లో బాబు ఆలోచించారు. చివరికి జిల్లాలో యువనేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడయిన పులివర్తి నానిని చంద్రగిరి అభ్యర్థిగా బాబు ప్రకటించారు. రాజకీయ కుటుంబానికి చెందిన నాని వార్డు మెంబరు స్థాయినుంచి ఎదిగారు. 2001లో పులివర్తివారిపల్లెకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ బలోపేతానికి అలుపెరుగని కృషిచేశారు. ఈ తరుణంలోనే ఆయనపై చంద్రబాబు దృష్టిపడింది. పైగా మంత్రి నారా లోకేశ్‌కు నాని వీరవిధేయుడు. పార్టీ కార్యాలయంలోనే పులివర్తి నాని ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. ఈ అర్హతల రీత్యా చంద్రబాబుకు నానిపై నమ్మకం పెరిగింది. ఆయన అయితేనే చెవిరెడ్డిపై పోటీచేసి గెలవగల అభ్యర్థి అని చంద్రబాబు భావించారు.

చంద్రగిరి అభ్యర్థిగా బాబు తన పేరు ప్రకటించటంతో నాని తన మార్క్‌ రాజకీయం ప్రారంభించారు. నియోజకవర్గంలో చిన్నాచితకగా ఉన్న అసంతృప్తులను కూడగడుతున్నారు. వారిని ఒక తాటిపైకి తీసుకువస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సూటిగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలోకే ఆయన దిగేశారు. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో చంద్రన్న నిర్ణయం వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూద్దాం...!!