ప్రత్యేక హోదా ఇస్తారు..కానీ..?

 

బీజేపీ నుండి అలా విడిపోయారో లేదో..అప్పుడే బీజేపీ పై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసేశారు. ఇన్ని రోజులు సహనంతో ఉన్న చంద్రబాబు కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని సంచలన విమర్శలు గుప్పించారు. మోదీ వంటి వేల కోట్ల మేరకు మోసం చేసిన వారిని దేశం దాటి పోనిచ్చింది స్వయంగా ప్రధానేనని..  నీరవ్ మోదీ, విజయసాయిరెడ్డి, జగన్ వంటి ప్రజాధనం మెక్కిన వారిని పక్కన కూర్చోబెట్టుకున్న నరేంద్ర మోదీ, వారికి అండగా నిలిచారని నిప్పులు చెరిగారు. ఇప్పటికే బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకునే ప్లాన్ లో ఉన్నారని ఎన్నోసార్లు చెప్పిన చంద్రబాబు ఇక ఉన్నట్టుండి పవన్ యూటర్న్ తీసుకోవడంతో.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా వీరితో కలిపి విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటం గురించి మాట్లాడిన ఆయన మోడీపై మండిపడ్డారు.

 

ఏపీకి  ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నట్టు తనకు తెలిసిందని కానీ ఇక్కడే మోడీ ఓ ప్లాన్ వేశారని చెప్పారు. వైకాపా, జనసేన చేసిన నిరసనలు, కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే ఇస్తున్నట్టు ప్రజలను మభ్య పుచ్చాలన్నది మోదీ కుట్ర అని ఆరోపించారు. హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుతానని పవన్ వెల్లడించడాన్ని గుర్తు చేసిన ఆయన, పవన్ దీక్ష తరువాత విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తున్నామని, ప్రజా సెంటిమెంట్ ను గౌరవిస్తున్నామని ప్రధాని నుంచి ప్రకటన వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ఇప్పటికే పవన్ కల్యాణ్ కు కేంద్రంలోని పెద్దల నుంచి సూచనలు అందాయని చంద్రబాబు ఆరోపించారు.  కేంద్రం కుట్రలు, ఆడుతున్న డ్రామాలపై ప్రజల్లోకి వెళతామని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, దీన్ని ఎదుర్కొంటామని ఆయన అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. మరి చంద్రబాబు ఊహించినట్టు జరుగుతుందో..? లేదో...? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..