మీతో కటీఫ్.. మీ ఇష్టం..

 

ఇన్ని రోజులు ముసుగులో గుద్దులాటలాగ జరిగిన వ్యవహారానికి తెరపడింది. ఎన్నో రోజుల నుండి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ-బీజేపీ పార్టీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇక కేంద్ర బడ్డెట్ తరువాత ఈ వార్ ఇంకా తారాస్థాయికి చేరింది.  ఏపీకి కేంద్రం నిధులు సరిగా కేటాయించకపోవడం.. ప్రత్యేక హోదా విషయంలో.. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి చాలా ఇచ్చామని.. మరోపక్క మాకేం ఇవ్వలేదని రెండు పార్టీల నేతలు బహిరంగానే తిట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇక రెండు పార్టీలు కలిసి ఉండటం కష్టం అనే అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ఎప్పటినుండో విడిపోతారు.. విడిపోతారు అన్న వార్తలు రావడం తప్పా...ఇంతవరకూ జరిగింది లేదు. కానీ ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. రెండు పార్టీలు విడిపోయినట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసి.. ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని చెప్పినట్టు సమాచారం. ఈ ఉదయం ఎంపీలతో అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్టీయే నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న చంద్రబాబు వెంటనే ఆ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పారట. ఎన్డీయే కన్వీనర్ పదవి నుంచి కూడా వైదొలగుతున్నట్టు స్పష్టం చేశారట. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం చూపుతున్న వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ, అమిత్ షా పేరిట ఓ లేఖను పంపామని, అందులో మిగతా విషయాలన్నీ సవివరంగా ప్రస్తావించామని చంద్రబాబు చెప్పారట.

 

ఇదిలా ఉండగా చంద్రబాబు తమ నిర్ణయాన్ని చెప్పగా.. దానికి షా పెద్దగా స్పందించలేదని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంటుందని తమకు ముందే తెలుసునన్నట్టుగా అమిత్ మాట్లాడారని.. మీరు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏముంటుందని.. మీ ఇష్టమని మాట్లాడారట. మొత్తానికి రెండు పార్టీలు విడిపోయాయి. మరి ఇన్ని రోజులు కలిసివున్నా కూడా ఒకరి మీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటూ.. దుమ్మెత్తిపోసుకున్నారు...ఇప్పుడు విడిపోతున్నారు... ఇప్పుడు ఏం రేంజ్ లో తిట్టుకుంటారో చూద్దాం..