పవన్ ను ఏమనొద్దు..ఇద్దరి దారి ఒకటే..

 

ఏపీ రాజకీయాలు రోజు రోజుకి కొత్త మలుపులతో.. వాడి వేడిగా సాగుతున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడాది టైం ఉన్నా... ఇప్పుడే ఆ కాక మొదలైంది. ఎవరి ఎవరు పొత్తులు పెట్టుకుంటారు... ఎవరు ఒంటరిగా బరిలో దిగుతారు అన్న ప్రశ్నలు మాత్రం అప్పుడే సమాధానాలు దొరకని ప్రశ్నలు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీ చేసిన టీడీపీ-బీజేపీ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈసారి బీజేపీ-వైసీపీ కలిసి పోటీ చేస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు.ఆ పార్టీతో మేం పొత్తుకు రెడీ అన్నా ఎవరూ రారు.

 

మరి అన్ని పార్టీలు ఓకే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని బరిలో దిగుతాడా.. లేక ఒంటరిగా ఎన్నికల్లో దిగుతాడా.. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీతో పెట్టుకుంటాడు..?అన్నది పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్. కానీ వచ్చే ఎన్నికల్లో పవన్-చంద్రబాబు కలిసి ఏకమై ఎన్నికల బరిలో దిగుతారు అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ వాదనను తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే.. పవన్ పై చంద్రబాబు కానీ... చంద్రబాబుపై పవన్ కానీ విమర్సలు గుప్పించుకున్న సందర్భాలు లేవు. కాస్త అప్పుడప్పుడు పవన్ కళ్యాణే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై స్పందించి ప్రశ్నిస్తుంటాడు. అంతేకానీ చంద్రబాబుపై గట్టిగా విమర్శించిన దాఖలాలు లేవు. ఇక చంద్రబాబు కూడా పవన్ చేసిన పనిని సమర్ధిస్తారు కానీ... పవన్ పై ఎప్పుడూ విమర్శలు గుప్పించలేదు.

 

అందుకే ప్రతిపక్షాలు సైతం.. కేంద్ర ప్రభుత్వాన్ని, విపక్షం మీద అయితే విరుచుకుపడతారు.. మరి రాష్ట్రప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు అని పవన్ పై రివర్స్ కౌంటర్లు వేస్తుంటారు. అంతేకాదు పవన్ చేపట్టనున్న జేఎఫ్సీ కమిటీ పై కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ చేసే పోరాటంలో అర్ధం ఉందని అన్నారు.. ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చంద్రబాబు తెలిపారు.. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అంతేకాదు...పవన్ విషయంలో టీడీపీ నాయకులకు కొన్ని సూచనలు కూడా చేశారంట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదని.. రాష్ట్రానికి మంచి చేయాలనేది పవన్ అభిమతమని... మనం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని... ఈ నేపథ్యంలో, ఇద్దరి దారీ ఒకటేనని చెప్పారట. అవసరమైన సమయంలో టీడీపీకి ఆయన అనుకూలంగా ఉంటారని చెప్పారు. పవన్ ప్రకటించిన జేఎఫ్సీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నిధుల గురించి పవన్ శ్వేతపత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని సూచించారట. మొత్తానికి చంద్రబాబు మాటలను బట్టి చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లో పవన్-చంద్రబాబు కలిసి బరిలో దిగొచ్చని స్పష్టంగా అర్ధంచేసుకోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అవసరమైనప్పుడు అనుకూలంగా ఉంటాడు అంటే అర్ధం ఇంకేమై ఉంటుంది మరి...