బాబుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం... చేతకానివాళ్లమా..!

 

ఉరుము ఉరిమి మంగలం మీద పడిందట...అలా ఉంది ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి. అక్కడెక్కడో గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని ఎఫెక్ట్ ఇక్కడ ఏపీలో పడుతుంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే కదా. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో ఏదో చచ్చీ చెడీ...బీజేపీ గెలిచింది. ఈ విషయం మోడీ-అమిత్ షా ద్వయానికి కూడా బాగా తెలుసు. అందుకే పై పైకి ఏదో గెలిచామని ఆనంద పడుతున్నా.. లోపల మాత్రం వారికి గుబులు మొదలైంది. మోడీ పై జనాల్లో ఉన్న వ్యతిరేక భావం  ఒక్కసారిగా బయటపడింది. నాలుగేళ్ల పాలనలో మోడీ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. ఇక ఈ గెలుపు కోసం మోడీ చాలానే కష్టపడ్డారు. ఆఖరికి పాక్ ను తెరపైకి తీసుకొచ్చి విమర్శలపాలయ్యారు. ఏదోలాగ బీజేపీనైతే గెలిపించారు. గెలుపు అయితే దక్కింది కానీ దాన్ని సెలెబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలుండగా వచ్చిన ఈ ఫలితాలతో ప్రధాని మోడీ, అమిత్ షా ఎలాగా అని కిందామీదా పడుతున్నారు. కానీ ఇక్కడ ఏపీలో బీజేపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు.  గుజరాత్ ఫలితాలు చూసి కాలర్ ఎగరేస్తున్నారు.

 

సోము వీర్రాజు లాంటి వాళ్లైతే ఏకంగా.. ఏపీలో ఈసారి అధికారం మాదే అని..దమ్ముంటే పొత్తు అక్కర్లేదని టీడీపీ ని చెప్పమని సవాల్ విసురుతున్నాడు. ఈయనగారి మాటలకు నవ్వుకోవాలో..లైట్ తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఇక సోము వీర్రాజు మాట్లాడిన మాటలకు టీడీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనిపై స్పందించిన చంద్రబాబు పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. భాజపాను పల్లెత్తు మాట అనవద్దంటూ నేతలకు ఆదేశాలిచ్చారు.

 

ఇక్కడే చంద్రబాబుకు చిక్కొచ్చి పడింది. చంద్రబాబు వారిని కంట్రోల్ చేయడం అస్సలు నచ్చడం లేదట. భాజపా నాయకులు మాటల్లో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటే మనం మాత్రం నోరుమూసుకుని కూర్చోవాలా అని పార్టీ నేతలు మధన పడుతున్నారట. బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ పదే పదే టీడీపీపై విమర్శలు గుప్పిస్తుంది.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది... ఇలాంప్పుడు కూడా.. ఉన్నదున్నట్టుగా మొహం మీద దులిపేస్తే తప్పేంటని తెలుగుదేశం వర్గాలు ఉద్రేకపడుతున్నారట. ఒకవైపు తాము తప్ప తెలుగుదేశానికి గత్యంతరం లేదన్నట్టుగా భాజపా విర్రవీగుతోంటే.. దానికి కూడా కౌంటర్ ఇవ్వకపోతే.. తమను అసమర్థులు కింద జమకట్టేస్తారేమో అని తెలుగుతమ్ముళ్లు ఉగ్రులవుతున్నారు. భాజపా విషయంలో సంయమనం పాటించాలనే చంద్రబాబు డైలాగులు ఎవ్వరికీ రుచించడం లేదట. అంతేకాదు.. బీజేపీ పై ఉన్న కోపం ఇప్పుడు చంద్రబాబు పై మళ్లుతుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మొత్తానికి అటు బీజేపీ విమర్శలు.. ఇటు పార్టీ నేతల ఆగ్రహం.. అడకత్తెరలో పోక చెక్క మాదిరి అయింది. మరి బాబు గారు దీనిపై ఒక్కసారి ఆలోచిస్తే మంచిది.