ఈ యువకార్డుతో చంద్రబాబు చెక్ పెట్టడం సాధ్యమేనా

 

ఇంతకాలం రాష్ట్ర విభజన అంశాన్ని భుజానికెత్తుకొని ప్రయాసపడుతూ భారంగా రోజులు దొర్లించిన అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందగానే ఆ బరువు దించుకొన్నట్లు తెలికపడ్డాయి. ఇక ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణ భాద్యతను ఆనందంగా భుజానికెత్తుకొని ‘మేమే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామంటే కాదు మేమే నిర్మిస్తామని’ పోటీలు పడుతున్నాయి. ఆంధ్రలో తెదేపా, తెలంగాణాలో తెరస ఈ ‘పునర్నిర్మాణ పోటీ’లో ముందజలో ఉన్నాయి. వాటికి కాంగ్రెస్, వై కాంగ్రెస్ లు పోటీ ఇస్తున్నాయి. చంద్రబాబు గతంలో తన హయంలో హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ ని అభివృద్ధి చేశానని, అందువల్ల ఇప్పుడు మళ్ళీ తేదేపాకు అధికారం అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని సింగపూర్ లాగా మార్చేస్తానని హామీ ఇస్తున్నారు. అంతే కాకుండా కేవలం తనకీ, తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఆ సామర్ధ్యం, దీక్షదక్షతలు ఉన్నాయని చంద్రబాబుతో సహా తెదేపా నేతలందరూ కోరస్ పాడుతున్నారు.

 

చంద్రబాబుకి నిజంగానే ఆ సామర్ధ్యం ఉందని అందరికీ తెలుసు. కానీ ఎటువంటి రాజకీయ అనుభవం కానీ, పరిపాలనానుభవం గానీ లేని జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ‘పునర్నిర్మాణ పోటీ’లో ‘యువకార్డులు’ వేసి జాయిన్ అయిపోయారు. నిన్నటి తరం నాయకుడైన చంద్రబాబు వలన రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమయ్యేపని కాదని, తనవంటి ఉత్సాహవంతులయిన యువకులకే ఆ తెలివి తేటలు, సామర్ధ్యం ఉంటాయని, అందువల్ల ప్రజలలు తన పార్టీకే ఓటు వేసి గెలిపిస్తే, అందరూ ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని పునర్నిర్మించి చూపుతానని హామీ ఇచ్చారు.

 

అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత అకస్మాత్తుగా ‘యువకార్డు’ ఎందుకు బయటకు తీయవలసి వచ్చిందంటే, ప్రజలకు చంద్రబాబు పనితీరు, సామర్ధ్యం, దీక్షా దక్షతల గురించి తెలుసు. కనుక ఇప్పుడు చంద్రబాబు, తెదేపా నేతలు కలిసి ‘రాష్ట్ర పునర్నిర్మాణం’ అంశాన్ని తమ ప్రతీ సభలో గట్టిగా ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకొంటుంటే, సీబీఐ, కోర్టు కేసులు, చార్జ్ షీట్లు, జైలు అనుభవం తప్ప మరెటువంటి అనుభవమూ లేని జగన్, తను రాష్ట్రాన్ని పునర్నిర్మించగలనని ప్రజలకు నచ్చజెప్పడం చాలా కష్టమే. అందుకే అకస్మాత్తుగా ఈ ‘యువ ఆలోచన’ తో బరిలోకి దిగారు.

 

మరి ఇంతవరకు కిరణ్ కుమార్ రెడ్డితో సమైక్య చాంపియన్ రేసులో పాల్గొని, ఆయన చివరి నిమిషంలో బ్యాటు పడేసి పోటీ నుండి తప్పుకోవడంతో చాంపియన్ గా మిగిలిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ ‘పునర్నిర్మాణ పోటీ’ లో కూడా గెలుస్తారో లేదో తెలియాలంటే మరో మూడు నెలలు వేచి చూడాల్సిందే!