కొత్తనీరు అంతా మంచిదే కాకపోవచ్చును:తెదేపా కార్యకర్తలు

 

ఎన్నికల సమర శంఖం పూరించిన చంద్రబాబు నాయుడు, తెదేపా నుండి గతంలో ఇతర పార్టీలలోకి వెళ్ళినవారిని తిరిగి పార్టీలోకి రప్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడాలనుకొంటున్నసమర్దులయిన నేతలను కూడా పార్టీలోకి ఆకర్షించాలని ప్రయతిస్తున్నారు. 

 

చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అవినీతిమయమయిన కాంగ్రెస్ పార్టీలో చాలా మంది దొంగలు ఉన్నపటికీ, కొందరు సమర్ధులు, ప్రజాదారణకల నేతలు కూడా ఆ పార్టీలో ఉన్నారని, అటువంటి వారు తెదేపాలోకి రాదలిస్తే మనం వారిని స్వాగతిద్దాము” అని అన్నారు.

 

వైజాగ్ నుండి మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు తెదేపాలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ గంటా రాకను తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అదేవిధంగా తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి తెదేపాలోకి రావడాన్ని పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. తోట శ్రీరాములు, వంగా గీత తదితరలు కూడా తెదేపాలోకి వచ్చేఆలోచనలో ఉన్నారు. నెల్లూరు నుండి కాంగ్రెస్ శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, సర్వేపల్లి నుండి అడ్డాల ప్రభాకర్ రెడ్డి తెదేపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకా అనేకమంది కాంగ్రెస్ శాసనసభ్యులు, కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్న గల్లా జయదేవ్ వంటివారు అనేకమంది తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.

అయితే వారి రాకవల్ల పార్టీలో అలజడి లేవకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఎవరయినా ఇతర పార్టీల నేతలను తెదేపాలోకి చేర్చుకొనే ముందు స్థానిక తెదేపా నేతల, కార్యకర్తలని సంప్రదించి, తప్పనిసరిగా వారి అభిప్రాయలు పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే కొత్తవారిని చేర్చుకొంటామని ఆయన చెపుతున్నారు. వారిమాట కాదని బలవంతంగా కొత్తవారిని తెచ్చివారి నెత్తిన పెట్టబోమని కూడా ఆయన హామీ ఇచ్చారు.

 

ఒకేసారి బయట నుండి అనేకమందిని పార్టీలోకి ఆహ్వానిస్తే, చిరకాలంగా పార్టీని అంటిపెట్టుకొని సేవ చేస్తు టికెట్స్ఆశిస్తున్నవారు ఆందోళన చెందడం సహజం, అందువల్ల చంద్రబాబు నాయుడు, కొత్తావారిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నపటికీ, చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగయినా పార్టీ గెలవడం అత్యవసరమయినప్పటికీ, ఆ తొందరలో ఎవరినిపడితేవారి నమ్మిఅవకాశావాదులకు టికెట్స్ ఇస్తే, ఎన్నికలలో గెలిచిన తరువాత వారు పార్టీని మోసం చేసి వేరే పార్టీలలోకి మారిపోయే ప్రమాదం ఉంది.

 

కొన్ని నెలల క్రితం దాదాపు 11మంది తెదేపా శాసనసభ్యులు ఒకేసారి వైకాపాలోకి చేరడం, వారిపై స్పీకర్ ని అనర్హత వేటు వేయమని పిర్యాదు చేయవలసిరావడం వంటి అంశాలను మరిచిపోకూడదని తెదేపా కార్యకర్తలు కోరుతున్నారు. కొత్త నీరు అంతా మంచిది. పాతనీరు పనికి రాదని బయటపారబోసుకోవడం మంచిది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు వారి సలహాలను పాటిస్తారో లేదో, వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారో లేదో క్రమంగా తేలుతుంది.