తెదేపా కూడా తెలంగాణాను వదులుకొబోతోందా

 

కాంగ్రెస్ ప్రయోగించిన విభజనాస్త్రానికి మొదట వైకాపా తెలంగాణా వదిలిపెట్టి పారిపోగా, ఇప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో మాట్లాడుతున్న తీరు చూస్తే, త్వరలో తెదేపా కూడా తెలంగాణా నుండి మూట ముల్లె సర్ధుకొనే పరిస్థితి కనబడుతోంది. సీమంద్రాలో పార్టీని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ కాదనకపోయిన్నపటికీ, ఆయన బొత్తిగా తెలంగాణా సంగతి మరిచిపోయినట్లుగా సీమంధ్ర తరపున వఖల్తా పుచ్చుకొని మాట్లాడటం చూస్తుంటే తెదేపా కూడా తెలంగాణాను వదిలిపెట్టేయబోతోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

 

రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన కొత్తలో ఆయన సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కేంద్రం నాలుగయిదు లక్షల కోట్లు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అంటే ఆయన రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నట్లేనని వైకాపా ప్రచారం మొదలుపెట్టడంతో ఇప్పుడు ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. ఆయన ఆత్మగౌరవ యాత్రలో మాట్లాడుతున్నమాటలు సమైక్యవాదాన్ని సమర్దిస్తూ ఉండటంతో, ఇప్పుడు కాంగ్రెస్, తెరాసలు కూడా తెలంగాణపై ఆయన వైఖరిని స్పష్టం చేయమని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఇక పార్టీలోని తెలంగాణా నేతలయితే ఒకవేళ చంద్రబాబు కూడా సమైక్యాంధ్ర అంటే అప్పుడు తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో చేస్తున్న ప్రసంగాలను వారు నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ ఆయన ఇదే ధోరణి కొనసాగిస్తే పొమ్మనకుండా పొగపెట్టినట్లుగా తెలంగాణా నేతలందరూ ఒకరొకరుగా పార్టీని వీడే అవకాశముంది. అందువల్ల ముందుగా చంద్రబాబు ఇంటిని చక్కబెట్టుకొని ఆ తరువాత రాష్ట్రాన్ని, దేశాన్ని చక్కబెట్టే ఆలోచన చేస్తే మేలేమో! లేకుంటే ఆయన యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేసరికి తెలంగాణా నేతలెవరూ పార్టీలో కనబడరు.