సీఈసీకి తప్పిన ప్రమాదం

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తృటిలొ  పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతి కూల వాతావరణంలో చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ పిథోర్ గఢ్ జిల్లాలో బుధవారం (అక్టోబర్ 16) జరిగింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఉత్తరాఖండ్ అదనపు సీఈవోతో కలిసి ఆయన ఉత్తరాఖండ్ లోనిమున్సియారీకి వెడుతున్నారు. మార్గ మధ్యంలో పర్వత ప్రాంతాలలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో  చిక్కుకుంది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. వాతావరణం పరిస్థితులు మెరుగుపడిన తరవాత సీఈసీ యథావిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించి మున్సియారీకి వెళ్లారు.  
Publish Date: Oct 16, 2024 4:32PM

కొండాసురేఖకు బిగ్ షాక్... గురువారం  ఢిల్లీకి అసమ్మతి వర్గం

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , మంత్రి కొండాసురేఖ మధ్య జరిగిన  వివాదం  చిలికి చిలికి గాలి వానగా మారింది. బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ఫోటోలు లేకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కొట్టుకునే వరకు వెళ్లడంతో కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదంలో మంత్రి తల దూర్చడమే కాకుండా ఇన్ స్పెక్టర్ కుర్చీలో కూర్చొని పోలీస్ కమిషనర్ , సిఐలను దూషించడం వివాదాస్పదమైంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత దీపా దాస్ మున్షీకి ఫిర్యాదు చేసిన  వరంగల్ కాంగ్రెస్ నేతలు రేపు ( అక్టోబర్ 17) న ఢిల్లీ వెళ్లి  ఎఐసిసి నేత కెసీ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. వేములవాడలో మంత్రి రాక సందర్బంగా స్వామి వారికి సమర్పించే నైవేద్యం ఆలస్యం చేయడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని వారు అన్నారు. సినీ హీరో నాగార్జున కుటుంబ సభ్యుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే క్రిమినల్ కోర్టులో రెండు వేర్వేరు పరవు నష్టం దావాలను మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు. ఒకటి నాగార్జున , మరోటి కెటీఆర్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. సమంతకు క్షమాపణ చెప్పినప్పటికీ  ఈ వివాదం సద్దుమణగలేదు. పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గొడవ సద్దుమణిగినది అని చెప్పినప్పటికీ వరంగల్ కాంగ్రెస్ నేతలు తాడో పేడో తేల్చుకుంటామని అధిష్టానం దగ్గరికి బయలు దేరనున్నారు. అధిష్టానం సీరియస్ గా తీసుకుంటే కొండా సురేఖ మంత్రి పదవి ఊడే అవకాశం ఉంది. 
Publish Date: Oct 16, 2024 4:12PM

నడ్డాకు ఉద్వాసన? బీజేపీ కొత్త సారథి ఎవరంటే..?

బీజేపీలో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైందా అంటే ఆ పార్టీ సీనియర్ల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో అనుకున్న ఫలితాలు సాధించడంలో విఫలమైన నాటి నుంచీ బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి నడ్డాను తప్పించాలన్న చర్చ మొదలైంది. పనిలో పనిగా జాతీయ అధ్యక్షుడితో పాటుగా పార్టీ పదవులలో కూడా సమూల మార్పులు చేయాలని హైకమాండ్ భావిస్తోంది.  ముచ్చటగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరినా, అనుకున్న స్థాయిలో స్థానాలను గెలుచు కోవడంలో బీజేపీ వైఫల్యం నడ్డా మెడకు చుట్టుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే అంటే 2025 జన వరి లేదా ఫిబ్రవరిలో పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టు అవకాశాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల పట్ల తీవ్ర నిరుత్సాహంతో ఉన్న బీజేపీ హైకమాండ్.. నడ్డా మెతకతనం వల్లే ఫలితాలు అనుకున్న విధంగా రాలేదని భావిస్తున్నది. అందుకు పార్టీని ముందుండి నడిపించగలిగిన బలమైన నేత కోసం గాలిస్తోంది. వాస్తవానికి బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం గత జూన్ తోనే ముగిసింది. అయితే మోడీ, షాలకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నడ్డా స్థానంలో మరొకరిని తీసుకువచ్చే యోచన బీజేపీ హైకమాండ్ చేయలేదు. అందుకే బీజేపీ మూల సిద్ధాంతానికి విరుద్ధమే అయినా నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా జోడు పదవులలో కొనసాగిస్తూ వచ్చింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత, తాజాగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఇక నడ్డాకు ఉద్వాసన పలకక తప్పదన్న నిర్ణయానికి కమలం పెద్దలు వచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టగలిగే నేత ఎవరన్న దానిపై అధిష్ఠానంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. పరిశీలనలో  మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్రకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్, అలాగే రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత వసుంధరా రాజెపేర్లు ప్రముఖంగా వినిపి స్తున్నాయి. అయితే వీరంతా కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన నేతలు కావడంతో  మోడీ, షాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక ఆర్ఎస్ఎస్ అయితే నితిన్ గడ్కరీని సిఫారసు చేస్తోందని అంటున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల నాటికి ఎవరి పేరు ఖరారౌతుందన్నది వేచి చూడాల్సిందే. 
Publish Date: Oct 16, 2024 4:05PM

ఐఏఎస్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ పునర్విభజనలో భాగంగా తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లను కేంద్రం ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఈనెల 9న డివోపిటీ ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీచేసింది.అయితే, తాము తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, సృజనలు క్యాట్‌ను ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఊరట దక్కలేదు. డివోపిటీ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.  దీంతో  వీరంతా బుధవారం (అక్టోబర్ 16) హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ తీర్పు పై స్టే ఇవ్వాలని, తెలంగాణలోనే తమను కొనసాగించే విధంగా చూడాలని ఐఏఎస్ అధికారులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.  అధికారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఐఏఎస్‌లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు క్యాట్ ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పస్టం చేసింది. డీపీవోటి ఆదేశాల మేరకు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. 
Publish Date: Oct 16, 2024 3:43PM

రేపు హర్యానాకు చంద్రబాబు 

 గురువారం ( ఈ నెల 17)న ముఖ్యమంత్రి చంద్రబాబు హర్యానా వెళ్లనున్నారు.  ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ  ఎయిర్ పోర్ట్ నుంచి చండీగడ్ ఎయిర్ పోర్ట్ కు  కు బయలు దేరనున్నారు.  సాయంత్రం ప్రమాణ స్వీకారోత్సవం  ఉంటుంది. ఇటీవల హర్యానా  అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం అందింది.    ముఖ్యమం త్రి గా నయాబ్ సింగ్ సైనీ  ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.  అక్కడ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత  అదే రోజు రాత్రి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.
Publish Date: Oct 16, 2024 3:15PM