త్వరలో చంద్రబాబు డిల్లీ యాత్ర

 

బహుశః వైకాపా ఆరోపణలకు కొంచెం జంకినందునేమో చంద్రబాబు తన డిల్లీ యాత్రను వాయిదా వేసుకొని తన పార్టీ యంపీలను మాత్రమే డిల్లీ పంపి ఈడీ, విజిలన్స్ అధికారులకు తాను చెప్పదలచుకొన్నది వారిచే చెప్పించారు. అయితే, తను డిల్లీ బయలుదేరుతున్నట్లు ప్రకటించేసిన తరువాత, ఇప్పుడు వెళ్ళకపోతే నిజంగానే వైకాపా ఆరోపణలకు జడిసి వెళ్ళలేదనే మరో అపవాదు కూడా పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని భావించినందునో లేక ముందుగానే తన డిల్లీ ప్రయాణ తేదీలు ఖరారు చేసుకోవడం వలననో, చంద్రబాబు ఈ నెల 21న డిల్లీ బయలుదేరుతున్నారు. ఆయన తన పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించి, రాష్ట్ర విభజనపై అందరికీ అమోదయోగ్యమయిన విధంగా సత్వర నిర్ణయం తీసుకోమని వినతి పత్రం ఈయనున్నారు. అదేవిధంగా తన రెండు రోజుల పర్యటనలో ప్రతిపక్ష నేతలను కూడా కలిసి రాష్ట్ర పరిస్థితులపై వారితో చర్చించనున్నారు.

 

కానీ ఇప్పడు కూడా ఆయన  జగన్మోహన్ రెడ్డి బెయిలుపై కోర్టు 23న తీర్పు చెప్పబోతుండగా, సరిగ్గా దానికి రెండు రోజుల ముందే ఆయన డిల్లీ వెళుతున్నందున, మళ్ళీ వైకాపా ఆయనపై ఆరోపణల గుప్పించడం ఖాయం. ఎలాగూ వైకాపా నిందలు భరించక తప్పదు గనుక, మరి ఆయన కూడా సీబీఐ, ఈడీ, విజిలన్స్ అధికారులను కలిసి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతారో లేదో చూడాలి.