తెలంగాణాలో కొనసాగనున్న బాబు పాదయాత్ర

 

ఖమ్మం జిల్లలో 9 రోజులు పాదయాత్ర చేసిన చంద్రబాబు, ఈ రోజు మద్యాహ్నం నల్గొండ జిల్లలో అడుగుపెట్టనున్నారు. కొద్దిరోజుల క్రితం తెలుగుదేశంపార్టీ నల్గొండ జిల్లాలో ఆయన పాదయాత్ర ఉండబోదని ప్రకటించగానే స్థానిక నేతలు, కార్యకర్తలు స్వయంగా చంద్రబాబును కలిసి తప్పనిసరిగా తమ జిల్లాలో కూడా పర్యటించమని కోరడంతో, చంద్రబాబు వారి విజ్ఞప్తి మన్నిస్తూ ఆ జిల్లాను కూడా పర్యటించాలని నిర్ణయించుకొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం తరువాత నల్గొండలో అయన పాదయాత్ర మొదలవుతుంది.

 

రెండు రోజుల క్రితం తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ అయన తెలంగాణా సరిహద్దు దాటబోతున్నాడు గనుకనే, ఇప్పుడు ఆయన పార్టీ తెలంగాణాపై మాటమార్చి సమైక్యాంద్రా అని మళ్ళీ పాతపల్లవి పాడుతోందని అన్నారు. అందువల్ల చంద్రబాబు తెలంగాణాలోనే పాదయాత్ర కొనసాగిస్తూ ఆమె సవాలును స్వీకరించినట్లు భావించవచ్చును. అయన తెలంగాణాలోనే ఉన్నందున, సీమంద్రాకి చెందిన ఆయన పార్టీ నేతలు సమైక్యాంద్రా పల్లవి ఎత్తుకొన్ననేపద్యంలో తెలంగాణావాదులు ఆయనను స్వయంగా కలిసి తెలంగాణాపై తెలుగుదేశంపార్టీ వైఖరిని మరో మారు తెలుసుకొనే అవకాశముంది.