ముగ్గురు ఫైర్ బ్రాండ్లకు సవాల్! మల్కాజ్ గిరిలో ఆర్ఆర్ఆర్ వార్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గ్రేటర్ పోరులో మల్కాజిగిరి నియోజకవర్గం కీలకంగా మారింది. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు పైర్ బ్రాండ్ నేతలు ఇంచార్జులుగా ఉన్నారు. వారందరూ పేరు విచిత్రంగా ఆర్ అక్షరంతోనే ప్రారంభం అవుతోంది. దీంతో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ట్రిబుల్ ఆర్.. ఆర్ఆర్ఆర్ ఫైట్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.  మల్కాజ్ గిరి ఇంచార్జ్ గా మంత్రి ఈటెల రాజేందర్ ను నియమించింది అధికార పార్టీ. ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. కార్యకర్తల సమావేశాలు ముగించుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు రాజేందర్. బీజేపీ ఇంచార్జుగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్.. తెలంగాణలో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నిక విజేత రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ కూడా తన మార్క్ ప్రచారం స్టార్ చేశారు. తన సొంత నియోజకవర్గం కావడంతో మల్కాజ్ గిరిని సవాల్ గా తీసుకున్నారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి. ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మల్కాజ్ గిరిలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ లీడర్లు మకాం వేయడంతో రాజకీయం హీటెక్కిస్తోంది. మల్కాజ్ గిరి లోకల్ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కూడా ఫ్రైర్ బ్రాండే. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన మరింత దూకుడుగా  వెళుతున్నారు. దీంతో మల్కాజ్ గిరిలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ల మధ్య ప్రతిష్టాత్మక  సమరం సాగుతోందనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.  
   

మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తొమ్మిది డివిజన్లు ఉన్నాయి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది డివిజన్లు గెలిచి క్లీన్ స్వీప్ కొట్టింది అధికార టీఆర్ఎస్. మరోసారి అది రిపీట్ చేయాలనే టార్గెట్ తో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు ఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గంలో కొందరు సిట్టింగులను మార్చింది గులాబీ పార్టీ. మంత్రి పదవిపై చాలా రోజులుగా ఆశలు పెట్టుకున్నారు మైనంపల్లి. ఈసారి అవకాశం వస్తుందని భావించినా.. ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే మల్కాజ్ గిరి  పరిధిలోని అన్ని డివిజన్లలో గెలిచి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని మైనంపల్లి భావిస్తున్నారట. నియజకవర్గం పరిధిలో  గత అరేండ్లలో జరిగిన అభివృద్ది, ఇటీవల చేసిన వరద సాయం తమకు కలిసి వస్తుందని కారు పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అయితే వరద సాయం కొంత మందికే అందడంతో మిగిలివారంతా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. వరదల సమయంలో ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్లు, బల్దియా అధికారులు తమను పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.  దీంతో గులాబీ నేతల్లో కొంత ఆందోళన కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే బీజేపీ వల్లే వరద సాయం ఆగిపోయిందనే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

 

తెలంగాణ పీసీసీ రేసులో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి.. గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. తన లోక్ సభ పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎక్కువ డివిజన్లు గెలిచి పీసీసీకి లైన్‌ క్లియర్ చేసేకునేందుకు తన వ్యూహాలతో దూసుకెళ్తున్నాడు. మల్కాజిగిరి పరిధిలో తక్కువ సీట్లు సాధిస్తే పీసీసీ చీఫ్ పదవికి ఎఫెక్ట్‌ పడుతుందని భావిస్తున్న రేవంత్.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో గెలుపును సెమీ ఫైనల్‌గా భావించి తన శక్తిని మొత్తం ప్రచారంలో దారపోస్తున్నారు.  ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించేలా గ్రౌండ్‌ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్కువ డివిజన్లు గెలిస్తే.. పీసీసీ చీఫ్ విషయంలో వ్యతిరేకుల నోళ్లు మూయించొచ్చని భావిస్తున్నట్లుగా పార్టీలోని రేవంత్ రెడ్డి అనుచరుల్లో చర్చ నడుస్తోంది. వరద సాయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన పోరాటానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రేవంత్ పోరాటం వల్లే మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించిందని కాంగ్రెస్ చెబుతోంది. ఇదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు హస్తం లీడర్లు. 

 

దుబ్బాక వేవ్ గ్రేటర్‌లోనూ కొనసాగించి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని నిరూపించేందుకు రఘునందన్‌ రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దుబ్బాక విజయం వన్‌ టైమ్‌ వండరే అని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కామెంట్ చేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న రఘునందన్ రావు.. మల్కాజ్ గిరిలో  ఎక్కువ డివిజన్లు సాధించి మరోసారి హైకమాండ్‌ దృష్టిలో తనపేరు మారు మోగేలా చేసుకోవాలని ‌ప్లాన్ చేస్తున్నాడు. రఘునందన్ ను ఇంచార్జ్ గా నియమించడంతో మల్కాజ్ గిరి బీజేపీ కేడర్ లోనూ జోష్ పెరిగిందని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, వరద సాయంలో జరిగిన అవినీతే ప్రధాన ప్రచారస్త్ర్రంగా చేసుకుంటున్నారు రఘునందన్ రావు.  

 

మొత్తంగా తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు, టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం ఎదురుచూస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి రేవంత్‌రెడ్డి.. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఊపుమీదున్న ఎమ్మెల్యే రఘునందన్ రావులు ఎవరికివారు తమ సత్తా నిరూపించుకునేందుకు ట్రై చేస్తున్నారు. ముగ్గురు ముఖ్య నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రేటర్ పోరు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాక పుట్టిస్తోంది. ముగ్గురు మాటకారులే కావడం, ఫైర్‌ బ్రాండ్‌గా పేరుండటంతో గ్రేటర్ సమరంలో మల్కాజిగిరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.