పోలవరం ప్రాజెక్ట్‌ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

పోలవరం ప్రాజెక్ట్‌ కు కేంద్రం ఇచ్చే నిధులపై స్పష్టత వచ్చింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు.. ప్రాజెక్ట్‌ డ్యామ్‌ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని, పునరావాసంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. 

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై విజయవాడకు చెందని సౌరభ్ ఖమర్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని వివరణ కోరగా కేంద్రం జవాబు ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలపై స్పష్టత ఇచ్చింది. తాము ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. పునరావాస, పరిహారం ప్యాకేజీలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.

 

2015 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.8,614.16 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.950 కోట్లు మంజూరైనట్లు వెల్లడించింది. నాబార్డు ద్వారా రూ.7,664.16 కోట్లు మంజూరైనట్లు తెలిపింది. పోలవరానికి చేసిన వ్యయంలో ఇంకా రూ.2,234.77 కోట్లు పెండింగ్‌ ఉందని తెలిపింది. 

 

ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 71 శాతం, పునరావాస పనులు 19.85 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్రం వెల్లడించింది. పునరావాసంతో కలిపి 41.05శాతం మేర నిర్మాణం అయినట్టు తెలిపింది.