మొబైల్‌తో మెదడుకి ముప్పే!

 

మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి మంచిది కాదని చాలా వార్తలే ప్రచారంలో ఉన్నాయి. మగవాళ్ల ఫెర్టిలిటీని దెబ్బతీస్తాయనీ, కేన్సర్కు దారితీస్తాయనీ... ఇలా రకరకాల భయాలు ఉన్నాయి. కానీ అవి నిజమని నిర్ధారించే పరిశోధనలు తక్కువే! పైగా మొబైల్ కంపెనీల వెనుక వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉంది. వాటిని ఎదిరించి, మొబైల్ ఫోన్ల వల్ల ముప్పు వస్తోందని నిరూపించే సాహసం కూడా చాలామంది చేయలేకపోతున్నారేమో! ఇప్పుడు మాత్రం మొబైల్ ఫోన్ల వల్ల ఖచ్చితంగా మెదడుకి హాని జరుగుతోందని చెప్పే పరిశోధన ఒకటి వచ్చింది...

స్విట్జర్లాండుకి చెందిన Swiss Tropical and Public Health Institute అనే సంస్థ మెదడు మీద మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ఓ పరిశోధన చేసింది. దీనో కోసం ఓ 700 మంది అభ్యర్థులను ఎన్నుకొంది. వీళ్లంతా కూడా 12- 17 ఏళ్లలోపు వాళ్లే. 7 నుంచి 9 తరగతులు చదివే పిల్లలే! వీళ్లని ఓ ఏడాది పాటు గమనించి చూశారు పరిశోధకులు.

 

ఓ ఏడాది తర్వాత పిల్లల మెదడులోని కుడిభాగంలో కాస్త మార్పు రావడాన్ని గమనించారు. దాని వల్ల figural memory... అంటే చూసిన విషయాలను గుర్తుపెట్టుకునే జ్ఞాపకశక్తి తగ్గిపోతోందని తేల్చారు. మొబైల్ వాడే సమయంలో దాని నుంచి Radiofrequency Electromagnetic Fields (RF-EMF) అనే తరంగాలు ఉత్పత్తి అవుతాయనీ, వాటి వల్ల మెదడు దెబ్బతింటోందనీ గ్రహించారు. సాధారణంగా మనం కుడి చెవి వైపు ఫోన్ పెట్టుకుని మాట్లాడతాం కాబట్టి, కుడివైపు మెదడు ప్రభావితం అవుతోందన్నమాట! మొబైల్ ఫోన్లతో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం, ఆటలు ఆడటం లాంటి పనులు చేసినప్పుడు ఇలాంటి నెగెటివ్ ప్రభావం ఏదీ కనిపించలేదు.

మెదడు మీద మొబైల్ రేడియేషన్ ఎంతో కొంత ప్రభావం చూపుతుందని తేలిపోయింది. కానీ ఈ రోజుల్లో మొబైల్ లేకుండా పని జరగదు కదా.... మరి ఎట్లా? అంటే దానికి కొన్ని చిట్కాలు చెబుతున్నారు పరిశోధకులు.

 

 

 

- ఎక్కువగా ఫోన్లో మాట్లాడాల్సినవాళ్లు వీలైనంత వరకూ ల్యాండ్ లైన్ యూజ్ చేయండి.

- చిన్నపాటి విషయం చెప్పాల్సి వస్తే ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.

- సిగ్నల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ పూర్తి స్థాయిలో పనిచేయాల్సి వస్తుంది. ఆ సమయంలో దాని నుంచి ఎక్కువ రేడియేషన్ వెలువడుతుంది. అలాంటప్పుడు ఫోన్ మాట్లాడకపోవడమే మంచిది.

- ఫోన్ మాట్లాడేటప్పుడు హెడ్సెట్స్ ఉపయోగించడం వల్ల కూడా రేడియేషన్ ప్రమాదం తగ్గుతుంది. హెడ్ఫోన్స్ కుదరకపోతే బ్లూటూత్ కూడా వాడవచ్చు. 

    
- Nirjara