ప్రేమికుని అండ ఉంటే... డిప్రెషన్ తీరిపోతుంది

 

ప్రేమలో ప్రపంచమంతా అందంగానే కనిపిస్తుంది. కాని అన్నివేళలా జీవితం రంగులమయం కాదు కదా! ఊహించని కష్టాలుంటాయి. నిలదీసే సమస్యలు ఎదురవుతాయి. ఒకోసారి ఏం చేయాలో తోచని స్థితిలో నిస్సహాయంగా మిగిలిపోతాము. డిప్రెషన్లో కూరుకుపోతాము. ఇలాంటి సందర్భాలలో మనల్ని ప్రేమించినవారు అండగా నిలిస్తే.... డిప్రెషన్ కాస్తా ఎగిరిపోతుందంటున్నారు పరిశోధకులు.

 

కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డిప్రెషన్లో ఉన్న మనుషుల మీద వారి భాగస్వామి ప్రభావం గురించి అధ్యయనం చేశారు. డిప్రెషన్లో కూరుకున్న భాగస్వామికి అండగా నిలబడటం వల్ల, సమస్య చాలావరకు పరిష్కారం అయినట్లు తేలింది. డిప్రెషన్ వల్ల ఏర్పడే మానసిక సమస్యలు తీరడమే కాకుండా, ఆ సమయంలో లభించిన అండతో వారి మధ్య ఉండే బంధం కూడా దృఢపడినట్లు గమనించారు.

 

ఈ పరిశోధనలో తేలిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అటు డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తితో పాటుగా, వారికి అండగా నిలిచిన భాగస్వామి కూడా లాభపడ్డారట. వారిలో ఆత్మవిశ్వాసపు స్థాయి పెరగడాన్ని గమనించారు. అంతేకాదు... ఇలాంటి స్థితి గుండా దాటిన బంధంలోని వ్యక్తులలో, భవిష్యత్తులో కూడా డిప్రెషన్, ఆత్మన్యూనతకు సంబంధించిన సమస్యలు రాకపోవడాన్నీ గుర్తించారు.

 

పరిశోధన అంతా సవ్యంగానే ఉంది. కాకపోతే ఇందులో ఓ చిక్కు ఉంది. మానసిక సమస్యలు ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు భాగస్వాముల తోడ్పాటు చాలా ఉపయోగపడుతుంది. నిజమే! కానీ పూర్తిస్థాయిలో డిప్రెషన్ వంటి సమస్యలలో కూరుకుపోయేవారికి అండగా నిలబడం కష్టం. ఇలాంటివారికి సలహా ఇచ్చేందుకు ప్రయత్నించినా, సాయం చేయబోయినా... సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. అలాంటి భాగస్వాములు కలిగినవారు మరింత నేర్పుగా వ్యవహరించాలంటున్నారు. వారికి మీరు అండగా ఉన్నామన్న విషయం తెలియచేయాలే కానీ, నేరుగా వారి చేయిపట్టుకుని నడిపించే ప్రయత్నం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏదన్నా సాయం చేసినా కూడా వారి బరువుని పంచుకుంటున్నామన్న అనుమానం రానీయకుండా ప్రయత్నించమని సూచిస్తున్నారు. ఏదన్నా విహారయాత్రకు ప్లాన్ చేయడం, వారి రోజువారి పనులను కొంత భుజాన వేసుకోవడం... వంటి చర్యల ద్వారా పరోక్షంగా వారి మనసుని తేలికపరచమంటున్నారు.

 

గాయపడిన మనసు సేదతీరాలన్నా, ఓడిపోతామనుకున్న జీవితంలో తిరిగి నిలదొక్కుకోవాలన్నా... మన భాగస్వామి అండ చాలా అవసరం అన్నమాట!

- నిర్జర.