ఎగ్జిట్ పోల్స్‌పై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్.. మరింత ఉత్కంఠ

 

ఏపీలో వైసీపీదే అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కొన్ని సర్వేలు మాత్రం టీడీపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డాయి. అయితే ఏపీలో అంతో ఇంతో ప్రభావం చూపుతుందనుకున్న జనసేనకు ఒకటి రెండుకు మించి సీట్లు రావని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ అంచనాలపై జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌పై ఆందోళన చెందవద్దని..మే 23 వరకు వేచి చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

విశాఖ వన్‌టౌన్‌లో రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఎగ్జిట్‌ పోల్స్‌ను నేను పట్టించుకోను. మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నిత్యం ప్రజాసేవలోనే ఉంటాం. అనవసరంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చి ప్రజల్లో మరింత ఉత్కంఠ కల్గిస్తున్నారు. ఓపికతో ఉంటే ఈ నెల 23న అసలు ఫలితమే వచ్చేస్తుంది. ఏ ఫలితం వచ్చినా ప్రజా సమస్యలపై పోరాడాలని మా పార్టీ నిర్ణయించింది. గెలుపోటములు సహజం. ప్రజల కోసం పనిచేయాలన్న భావనతో మేం ముందుకెళ్తున్నాం." అని లక్ష్మీనారాయణ తెలిపారు.