సోనియాను ఎదిరిస్తే కేసీఆర్ కు జగన్ గతే

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల తన పాదయత్రాలలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిసూ ఆ పార్టీ సీబీఐని అడ్డం పెట్టుకొని తన ప్రత్యర్దులందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భయబ్రాంతులను చేస్తోందని ఆరోపించడం నిత్యం వింటున్నదే. కాంగ్రెస్ పార్టీ సీబీఐను అస్త్రంగా వాడుకొని తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లోఇరికించిందని ఆమెతో సహా ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిత్యం వింటున్నవే. తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా నిన్న అదే విధంగా మాట్లాడటం విశేషం.

 

బాబు జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా నిన్న ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. అతని చిట్టా సోనియా గాంధీ దగ్గర ఉందని తెలిసినందునే కేసీఆర్ కాంగ్రెస్ విషయంలో కొంచెం ఆచి తూచి మాట్లాడుతున్నాడని, సోనియా గాంధీకి కోపం తెప్పిస్తే తనకు కూడా జగన్ పట్టిన గతే పడుతుందని తెలిసినందునే ఆమె ముందు కిక్కురుమనడని ఎద్దేవా చేసారు. మోత్కుపల్లి కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్నపటికీ, ఆ విమర్శలలో సోనియా గాంధీ తలుచుకొంటే ఎవరినయినా జైలు పాలు చేయగలదని అని చెప్పడం వాస్తవ పరిస్థితులకి అద్దం పడుతోంది.

 

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది పార్టీల నేతలు ములాయం సింగ్, మయవతి ఇద్దరూ కూడా ఇదేరకమయిన ఆరోపణలు బాహాటంగానే చేస్తున్నారు. ఇక, బాజపా నాయకుడు వెంకయ్య నాయుడు మరో అడుగు ముందుకు వేసి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధీనంలో సీబీఐ పనిచేసేదని కానీ ఇప్పుడు సీబీఐయే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా నిలబెట్టే స్థాయికి ఎదిగిపోయిందని తీవ్ర విమర్శలు చేసారు. అయితే, ఈ విమర్శలను అప్పుడప్పుడు సీబీఐ అధికారులు లక్ష్మినారాయణ వంటివారు ఖండింస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎన్నడూ నేరుగా జవాబు చెప్పడం కానీ, ఖండించకపోవడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే విపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందని అర్ధం అవుతోంది.

 

గత తొమ్మిదేళ్ళలో రాష్ట్రంలో వైఎస్ కుటుంబం రూ. లక్ష కోట్లు సంపాదిస్తే, కెసిఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు గడించిందని మోత్కుపల్లి చేసిన విమర్శలు కూడా ఆలోచింపదగినవే. వారిరువురూ అక్రమాస్తులు కూడా బెట్టేరా లేదా అనే చర్చను పక్కన బెట్టి చూస్తే, ప్రతిపక్షలలో ఉన్న నేతలు ఈవిధమయిన అక్రమాలకు పాల్పడటమే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక వరంగా మారిందని, తద్వారా ఆ పార్టీ సీబీఐను అస్త్రంగా చేసుకొని ఎవరినయినా లొంగదీయగలుగుతోందని అర్ధం అవుతోంది. అంటే, కాంగ్రెస్ సీబీఐను వాడుకోవడం ఎంత నిజమో, ప్రతిపక్షాల నేతల అవినీతికూడా అంతే నిజమని అర్ధం అవుతోంది.

 

జగన్ మోహన్ రెడ్డి అచిర కాలంలోనే వేల కోట్లు ఖర్చు చేసి ఒక టీవీ చానెల్, ఒక పత్రిక, బెంగుళూరు, హైదరాబాద్‌, కడప తదితర ప్రాంతాలలో ఇంద్రభవనాలు వంటివి కట్టించుకోవడం, కేవలం కొన్ని సం.ల కాలంలోనే వేల కోట్లు విలువయిన ఆస్తుల సంపాదించడం ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీకి దాని చేతిలో ఉన్న సీబీఐకి చిక్కితే, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమం పేరిట ఎంత సంపాదించుకొన్నపటికీ, వారెవరూ నేరుగా కాంగ్రెస్ అధినేత్రిని డ్డీ కొనకపోవడం వలననే ఇంత కాలం సురక్షితంగా ఉండగలుగుతున్నారని మోత్కుపల్లి నరసింహులు మాటలు వివరిస్తున్నాయి.

 

ఇటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి సీబీఐను వాడుకొంటోందని స్పష్టం చేస్తుంటే, అందుకు కారణం విపక్షల నేతల అవినీతి, అక్రమాస్తులేనని కూడా తెలియజేస్తోంది. అందువలన అందరూ ఆ త్రానులో ముక్కలేనని భావించవలసి ఉంటుంది.