కెవిపికి సిబిఐ సమన్లు, జగన్ కు ఉచ్చుగా మారనున్నాయా

 

షర్మిలతో సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా త్వరలో జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కాబోతున్నడని ప్రకటించుకొంటున్న ఈ తరుణంలో, సీబీఐ నేడు కేవీపీ రామచంద్రరావుకి సమన్లు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.

 

మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన తరువాత అంతటివాడుగాఒక వెలుగు వెలుగుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చక్రం తిప్పిన ఆయన, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకొన్న ప్రతీ నిర్ణయంలోను ప్రమేయం ఉండేదని అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ, ఇంతకాలంగా జగన్ అక్రమాస్తుల కేసులను, ఓబులాపురం గనుల వ్యవహారాల కేసులను చేపట్టి అనేక మందిని అరెస్ట్ చేసి కటకటాలు వెనుకకి పంపిన సీబీఐ, ఇంతకాలం కేవీపీ జోలికి మాత్రం వెళ్ళలేదు.

 

అయితే, ఇప్పుడు వైకాపా నేతలు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి నేడో రేపో బయటకి వస్తాడని ఆశిస్తున్న తరుణంలో, సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసులోనే ఆయనకు కూడా విచారణకు సమన్లు జారీ చేయడం చూస్తే, జగన్ మోహన్ రెడ్డి చుట్టూ మరింత ఉచ్చు బిగించేందుకే ఆయనను తమ ట్రంప్ కార్డుగా ఉంచుకొని ఇంతకాలం ఆయన జోలికి వెళ్ళలేదేమో? అనే సందేహం ఏర్పడుతుంది. అదే నిజమయితే, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకావడం సంగతి ఎలా ఉన్నా ముందు కేవీపీని లోపలి పంపకుండా సీబీఐ ఊరుకొంటుందా? అనే ప్రశ్నతల ఎత్తుతుంది.

 

కేవీపీ ఇటీవల కడప సహకార ఎన్నికలలోజగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వెంటనే డీసీసీబి అధ్యక్షపదవికి ఎన్నికలు జరిపించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించడం చూస్తే ఆయన ఏ పార్టీ తరపున పనిచేస్తున్నాడని అందరికీ అనుమానం కలిగింది. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన మీద అనుమానం కలుగదని భావించలేము.

 

ప్రస్తుతం ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకే అంటిపెట్టుకొని ఉన్నపటికీ, భవిష్యత్తులో, బహుశః సరిగ్గా ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ లోకి మారే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నందునే ఇప్పుడు ఆయన పేరును కూడా సీబీఐ ఖాతాలో కాంగ్రెస్ చేర్పించి ఉండవచ్చును.

 

అయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని గట్టిగా కోరుకొంటున్నవారెవరూ ఇప్పుడు పార్టీలో లేరు. కానీ, ఆయన తమ పార్టీని వీడి జగన్ పార్టీలో చేరాలని మాత్రం ఎవరూ కోరుకోవట్లేదు. అందువలన ఆయనను అటువైపు వెళ్ళకుండా చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించి ఉండవచ్చు కూడా.

 

అయితే, కేంద్ర రాష్ట్రస్థాయిలో అందరితో మంచి సంబందాలు , పలుకుబడి కలిగిన ఆయనపై సీబీఐ తన ప్రభావం చూపగలదా అని ఆలోచిస్తే, కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినందునే సీబీఐ ఇప్పుడు ముందడుగు వేసి ఉంటుందని భావించాల్సి ఉంటుంది. అదే నిజమయితే, త్వరలోనే కేవీపీ కూడా లోపలి వెళ్ళడమే కాకుండా, జగన్ మోహన్ రెడ్డి మరి కొంత కాలం లోపలే కాలక్షేపం చేయక తప్పదు.

 

రేపు సీబీఐ ఆయనను ప్రశ్నించిన పద్దతిని బట్టి మిగిలిన కధ తేటతెల్లమవుతుంది అని చెప్పవచ్చును.