పశువుల విషయంలో పంతం నెగ్గించుకుంటున్న కాషాయదళం!

 

మోదీ సర్కార్ కు మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ త్రీ ఇయర్స్ లో నమో తరువాత అంతగా చర్చింపబడ్డది మరెవరైనా వున్నారంటే… అది గోమాతే! ఆవు రాజకీయాలు ఇటు అధికార పక్షం వారూ, అటు ప్రతిపక్షం వారూ అందరూ జోరుగా చేసేస్తున్నారు. తాజాగా మోదీ గవర్నమెంట్ మూడేళ్లు పూర్తి చేసుకున్న శుభతరుణంలో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లని నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేరుగా పశు వధ నిషేధం అనకున్నా దీని అంతిమ లక్ష్యం గోవధని అరికట్టడమే!

 

గోవు హిందువులకి పవిత్రం. ఆ గోమాతను పూజించే హిందువులే ఇంకా భారతదేశంలో ఇప్పటికీ మెజార్టీ ప్రజలుగా వున్నారు. వారికి ఎప్పట్నుంచో బేజీపి ఇస్తూ వస్తోన్న హామీ గోవధ జరగకుండా చూడటం! కాని, గోవు అనగానే ఒంటి కాలు మీద లేచే వర్గం కూడా ఒకటి వుంది మన దేశంలో. ఆవు మాంసం తినే దళితులు, ముస్లిమ్, క్రిస్టియన్ మైనార్టీలు ఎలాగూ వ్యతిరేకిస్తారు… కాని, వారికంటే ఉధృతంగా, ఉక్రోశంగా గోవధని వ్యతిరేకిస్తారు మన దేశంలో సెక్యులర్ రాజకీయ నాయకులు. అలాగే, ఆదర్శవాదులుగా గుర్తింపు పొందిన మేధావులు, ఉద్యమకారులు కూడా ఆవు అనగానే ఆస్త్రశస్త్రాలు తీసి వాదోపవాదాల్లో దిగిపోతారు! ఇదే ఇప్పుడు ఆవు కథకి మూలమై కూర్చుంది! ఎవ్వరూ వెనక్కి తగ్గని పరిస్థితి…

 

బీజేపీ స్వంత మెజార్టీతో ఒక స్వయం సేవకుడైన మోదీ పీఎం అవ్వటంతోనే సెక్యులర్ రాజకీయ పక్షాలు ప్రతీ చిన్న హిందూ అంశాన్ని బూతద్దంలో చూడటం మొదులు పెట్టాయి. ఆ క్రమంలోనే యూపీలో దాద్రి సంఘటన పెద్ద కలకలం రేపింది. బీఫ్ తిన్నాడని ఒక ముస్లిమ్ ని ఊరి ప్రజలు దాడి చేసి చంపేశారు. దీన్ని శాంతి, భద్రతల సమస్యగానో, అప్పటి ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ వైఫల్యంగానో చూడకుండా అంతా కలిసి మోదీ మీదకి ఎక్కుపెట్టారు. దాద్రి తరువాత జరిగిన బీహార్ ఎన్నికల్లో కాషాయదళం ఓడిపోవటం కూడా బీఫ్ పాలిటిక్స్ పట్ల ప్రతిపక్షాల నమ్మకాన్ని పెంచాయి. కాని, మొన్న జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపి బంపర్ సక్సెస్ అదంతా తప్పని తేల్చేసింది. మీడియా, మేదావులు, పార్టీలు బీఫ్ గురించి ఎంత మాట్లాడినా జనం మోదీ, అమిత్ షాల కాషాయదళాన్నే నెత్తిన పెట్టుకున్నారు! ఆ విజయమే ఇప్పుడు ప్రధాని చేత సైలెంట్ గా పశు వధ నిషేధం నిర్ణయం చేయించింది!

 

సర్జికల్ స్ట్రైక్స్, డీమానిటైజేషన్ లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలే సీక్రెట్ గా చేయగలిగిన మోదీ ఈ గోవధ నిషేధం నిర్ణయం కూడా ఎవ్వరికీ లీకులు ఇవ్వకుండానే చేసేశారు. పర్యావరణ శాఖ చేత గెజిట్ రిలీజ్ చేయించి ఆవుల అక్రమ దందాలన్నిటికి చెక్ పెట్టారు. అమల్లో ఎంత వరకూ గోవుల వధ తగ్గుతుందో ఇప్పుడే చెప్పలేం. కాని, ఈ నిర్ణయం మాత్రం… రాష్ట్రపతి ఎన్నికల హడావిడిలో వున్న ప్రతిపక్షాలకి పెద్ద షాక్! అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా చాలా పార్టీలు నిర్ణయించుకోలేకపోయాయి. మీడియాలో ఎప్పటిలాగే దళితుల పక్షానా, మైనార్టీల పక్షాన నిలిచే వారొచ్చి కొంత వరకూ వాదించినా… పశువుల విక్రయాల నియంత్రణకి పెద్దగా రాజకీయ నిరసన ఎదురు కాలేదు! బహుశా దీనికి మూలం యూపీలో కబేళాల మూసివేతతో యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రయోగమే కారణం అనుకుంటా. రాత్రికి రాత్రి ఆయన కబేళాలు మూసివేయిస్తే మీడియా, పార్టీలు ఎంత అల్లరి చేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మోదీ సర్కార్ కూడా దేశ వ్యాప్తంగా పశువుల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గే సూచనలు కనిపించటం లేదు.

 

గోవధ నిషేధాన్ని వ్యతిరేకించే వారి వాదనలో నిజానికి న్యాయం వుంది. ప్రజాస్వామ్యంలో ఒకరి ఆహారపు అలవాట్లని ప్రభుత్వం నియంత్రించరాదు. కాని, అదే సమయంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తోన్న మూర్ఖపు పోరు సత్ఫలితాల్ని ఇవ్వలేకపోతోంది. కేవలం ఆరెస్సెస్ , బీజేపిలే కాదు భారతదేశంలో కోట్లాది మంది గోవధని వ్యతిరేకిస్తారు. అందుకే జనం మద్దతు తమకు వుంటుందన్న ధీమాతోనే మోదీ సర్కార్ ముందడుగు వేసింది. ఒక విధంగా రైతులకి ఈ తాజా నిర్ణయం ఇబ్బంది కలిగించినా అత్యధిక జనం మత విశ్వాసాలు గౌరవించబడతాయి. ఈ కోణంలో గోవధ నిధేధాన్ని ఖండించే వారు ఆలోచించలేకపోతున్నారు. గోవధ నిషేధం వల్ల వచ్చే నష్టాల్ని ప్రభుత్వం ఎలా పూడుస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న డిబేట్ కాకుండా… ఆవుల్ని చంపి తిననివ్వాల్సిందే అనే మంకు పట్టు పడుతున్నారు.

 

ఇప్పటికైనా గోవధ చుట్టూ చర్చని జరపటం కాకుండా… గోవధ నిషేధం వల్ల వచ్చే కష్ట, నష్టాల్ని అందరూ చర్చిస్తే బావుంటుంది. ఇటు కబేళాలకు అమ్ముకునే రైతుల ఇబ్బంది ఏంటి పరిష్కారం? అటు గో మాంసం తినటం అలవాటుగా వున్న వర్గాల వారికి ఎదురయ్యే ఇబ్బందులకి ఏంటి పరిష్కారం? చర్చించాల్సి వుంది. అలా కాకుండా గో మాంసాన్ని కేవలం సెక్యులర్ రాజకీయాలకు సింబల్ గా వాడుకుంటే… గోమాతని కాషాయ వర్గం కూడా తమ రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించుకుంటుంది!