కుల వివాదాలు పెరుగుతున్నాయి… కులం బలహీనపడుతోంది!

మామూలుగానే మన దేశంలో కులం అంటే అందరూ అలెర్ట్ అవుతారు. వందలాది ఏళ్లుగా వున్న కులం స్వతంత్రం వచ్చాక కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికలు వస్తే మరింత మసాలా దట్టించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ నాయకులు కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. పార్టీలు అభ్యర్థుల కులాలు చూసే సీట్లు ఇస్తుంటాయి. చివరకు, పోలింగ్ రోజున ఓటర్లు కూడా కులం ఆధారంగానే తీర్పునిస్తుంటారు! ఇంత వ్యవహారం వుంది కాబట్టే కులం ఎప్పుడూ హాట్ టాపిక్కే! కానీ, తాజాగా జరిగిన ఓ సర్వే ఇండియాలో ఆవిష్కృతం అవుతోన్న కొత్త కోణం బయటపెట్టింది!

 

 

కులం పుట్టినప్పటి నుంచీ చచ్చేదాకా చాలా ముఖ్యమే. చదువులో, ఉద్యోగంలో అంతటా కీలకమే. కానీ, పెళ్లి విషయానికి వచ్చే సరికి కులం మరింత ప్రాముఖ్యత వహిస్తుంది. వేరు వేరు కులాల వారు పెళ్లి చేసుకుంటే ఎంత రచ్చవుతుంటుందో మనం చూస్తూనే వుంటాం. పరువు హత్యల దాకా వెళుతుంటాయి కేసులు. కానీ, ఒకవైపు ఇంత కుల మౌఢ్యం వున్నా కూడా మరో వైపు ఆధునిక భారతదేశం కులాన్ని లైట్ తీసుకుంటోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఇన్ షార్ట్ అనే యాప్ వారు నిర్వహించిన సర్వే ఫలితాలే!

 

 

ఈ ఆన్ లైన్ సర్వేలో ఒకరిద్దరు కాదు… ఏకంగా 1.3లక్షల మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అవేంటో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతీ 10 మందిలో 8 మంది తమకు కులాంతర వివాహం ఓకే అని చెప్పారట! 70 శాతం అబ్బాయిలు పెళ్లయ్యాక అమ్మాయి తన ఇంటి పేరు మార్చుకోకున్నా ఫర్వాలేదు అన్నారట!

ఇక ఎప్పుడూ అమ్మాయిల మీద జోకులేస్తూ… వాళ్లు బాగా డబ్బున్న అబ్బాయిలకి పడిపోతారని అంటూ వుంటారు. కానీ, ఈ సర్వే అది నిజం కాదని తేల్చింది. సర్వేలో పాల్గొన్న అమ్మాయిల్లో 84 శాతం మంది అబ్బాయి తమ కంటే ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదని అన్నారట! ఇంకో విస్తుగొలిపే విషయం ఏంటంటే… నిన్న మొన్నటి దాకా వరకట్నం కోసం తహతహలాడిన అబ్బాయిలు ఇప్పుడు రూటు మార్చారు. కట్నం కాదు… పెళ్లి ఖర్చులు అమ్మాయి తరుఫు వారికి తగ్గించేందుకు సై అంటున్నారట! 90 శాతం అబ్బాయిలు వధువు తరుఫు వారికి పెళ్లి ఖర్చులు తగ్గిస్తామనీ, అవసరం అయితే తమ వంతుగా కొంత భరిస్తామనీ అన్నారట!

 

 

ఒక సర్వేలో ఇలాంటి అభిప్రాయాలు వస్తే దేశం మారిపోయినట్టు కాదు. అది అంగీకరించాల్సిన విషయమే. కానీ, అదే సమయంలో ఈ ఫలితాలు క్రమంగా పొడచూపుతున్న మార్పుకి మాత్రం ఖచ్చితంగా సంకేతమే! కులం రాజకీయాల్లో, మీడియా చర్చల్లో పెద్ద ఇంపార్టెంట్ గొడవగా కనిపించినా… ఆధునిక కార్పొరేట్ యువత రాను రాను లైట్ తీసుకుంటున్నారు. పెళ్లి విషయంలో కూడా పట్టింపుల కంటే సర్దుకుపోవటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలాంటి పాజిటివ్ ధోరణుల్ని ప్రభుత్వాలు, మీడియా, మేధావులు ఎంకరేజ్ చేయాలి. కానీ, దురదృష్టవశాత్తూ మన సమాజంలో రెచ్చగొట్టి పది మంది దృష్టి ఆకర్షించే వారు ఎక్కువవుతున్నారు.