రిజర్వేషన్స్… రాజకీయ అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మారిపోయాయా?

కేసీఆర్ ముస్లిమ్ లకు 12శాతం రిజర్వేషన్స్ అనటం… వెంటనే బీజేపి వారు మతాల ఆధారంగా రిజర్వేషన్స్ ఏంటంటూ అంతెత్తున్న ఎగరటం… రెండూ జరిగిపోయాయి. ఇక ఇప్పుడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సదరు రిజర్వేషన్ల పెంపు బిల్లును పాస్ చేయటమే మిగిలి వుంది. కాని, ఆ తరువాత బాల్ కేంద్రం కోర్టులోకి వెళుతుంది. కేంద్రం అడ్డుకుంటే సుప్రీమ్ కి వెళతామని కూడా కేసీఆర్ ప్రకటించారు. అసలు ఒకవైపు ముస్లిమ్ లకు రిజర్వేషన్లు పెంచుతామని చెబుతూనే… అవ్వి మతం ఆధారంగా ఇస్తోన్నవి కాదంటూ వెరైటీగా చెప్పుకొచ్చారు సీఎం! బీసీ ఈ కోటాలో ముస్లిమ్ లకు రిజర్వేషన్లు పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఎలా చెప్పినా టీఆర్ఎస్ టార్గెట్ ముస్లిమ్ లకు అవకాశాలు పెంచటమే! అది అందరికీ తెలిసిన విషయమే! దాన్ని ఇప్పుడు బీజేపి క్యాష్ చేసుకునే పనిలో పడింది. ముస్లిమ్ రిజర్వేషన్లను వద్దనగలిగే పార్టీ అదొక్కటే మిగిలింది తెలంగాణ అసెంబ్లీలో!

 

ముస్లిమ్ లకు మతం ఆధారంగా రిజర్వేషన్స్ ఇస్తే ఏమవుతుంది? కేంద్రాన్ని దాటుకుని సుప్రీమ్ లో తేల్చుకోవాల్సిన విషయం ఇది. అప్పటి వరకూ టీఆర్ఎస్ తాము రిజర్వేషన్స్ ఇచ్చామని ప్రచారం చేసుకుంటుంది. బీజేపి అడ్డుకున్నామని చెప్పుకుంటుంది. ఇలా రాజకీయ క్రీడ నడుస్తూనే వుంటుంది. కాని, ఏప్రెల్ 14… అంబేద్కర్ జయంతి వేళ… మనం ఈ రిజర్వేషన్స్ ని రాజకీయ అంశంగా కాకుండా సామాజిక అంశంగా కూడా చూడాలి! నేతల ఓటు బ్యాంక్ రాజకీయాలతో దేశానికి జరుగుతోన్న నష్టమేంటో కూడా చూడాలి! అసలు రిజర్వేషన్స్ ఎంత కాలం కొనసాగించాలి అన్న విషయంలో రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టత లేదు. అందుకే, మన నాయకులు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లవుతోన్నా రిజర్వేషన్ల అంశాన్ని బంగారు బాతులా చూస్తున్నారు. వీలున్నప్పుడల్లా దాన్ని బయటకి తీసి కులాల మీద, మతాల మీద ప్రయోగిస్తున్నారు!

 

రిజర్వేషన్స్ అసలు ఉద్దేశ్యం పేదల విద్యా, ఉద్యోగ అవకాశాలు పెంచటం. వార్ని ఆర్దికంగా, సామాజికంగా గౌరవప్రదమైన స్థానంలో వుంచటం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇప్పటికన్నా కుల వివక్ష ఎక్కువ వుండేది కాబట్టి రిజర్వేషన్స్ కులాల ఆధారంగా ఇచ్చారు. కాని, అప్పుడు కూడా మతాల ఆధారంగా రిజర్వేషన్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే కుల వివక్ష వున్నట్లుగా మత వివక్ష లేదు. పైగా మతం దృష్టితో రిజర్వేషన్స్ ఇస్తే దేశ సమగ్రతకి ముప్పని కూడా కొందరు భావించారు. తరువాతి కాలంలో మత రిజర్వేషన్లు చెల్లవని సుప్రీమ్ కూడా తేల్చేసింది. ఇంకా కొన్ని కేసులు ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం ముందున్నాయి. అయినా ఎక్కడికక్కడ మన ఓటు బ్యాంకు నేతలు రిజర్వేషన్లు పెంచుతామని హామీలు గుప్పించి రచ్చకి కారణం అవుతున్నారు!

 

తెలంగాణలో ముస్లిమ్ రిజర్వేషన్ల మాదిరిగానే ఆంధ్రాలో కాపుల్ని బీసీల్లో చేర్చటం అనే వివాదం కూడా వుంది. అసలు గొడవకి కారణం మతమైనా, కులమైనా నేతల దృష్టంతా ఎన్నికలు, ఓట్ల మీదే వుండటంలోనే వుంది. అంతకు మించి ఇంకేం వద్దనుకునే పరిస్థితి వుండటంతోనే రిజర్వేషన్ల వ్యవస్థలోని లోపాలపై ఎవ్వరూ మాట్లాడలేకపోతున్నారు. కులాలు, మతాల ఆధారంగానే రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలి? పేదరికం ఆధారంగా ఎందుకు ఇవ్వకూడదు? రిజర్వేషన్స్ వల్ల కుల వివక్ష ఎంత వరకూ పోయింది? అసలు రిజర్వేషన్స్ కి, వివక్షకి ఏమైనా సంబంధం వుందా ? ఇలాంటి ప్రశ్నలు వేసే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు. అందుకు మంచి ఉదాహరణే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ముస్లిమ్ రిజర్వేషన్ల బిల్లు. అది కేంద్రం, సుప్రీమ్ లను దాటుకుని నిజమైన పేద ముస్లిమ్ లకు మేలు చేయటానికి ఎంత కాలం పడుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి!

 

డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకున్న స్వతంత్ర దేశంగా ఇప్పటికైనా రిజర్వేషన్ల పై సమగ్ర పునః సమీక్ష జరగాలి భారత్ లో. మరింత సమర్థంగా, ప్రతీ పేదవాడికి వాటి వల్ల లాభం కలిగేలా సంస్కరణలు తేవాలి. అలాగే, నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాలకు రిజర్వేషన్లు ఉపయోగపడకుండా నియమాలు రూపుదిద్దుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా, అంబేద్కర్ అకాంక్షించినట్టు … రిజర్వేషన్స్ అనేవి కుల వివక్ష సమసిపోయేలా వుండాలి. అందుకోసం ఏం చేయాలో అందరూ తక్షణం ఆలోచించాలి!