మీ పిల్లలు ఫోన్‌ చూస్తూ నిద్రపోతున్నారా!

ఒకప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చేందుకు కథలో కబుర్లో చెబితే సరిపోయేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కథలు చెప్పే ఓపిక పెద్దలకీ లేదు, కబుర్లు వినే ఉత్సాహం పిల్లవారికీ లేదు. ఇప్పుడంతా డిజిటల్‌మయం. కాసేపు ఫోనో, టీవీనో, టాబ్లెట్టో చూసీచూసీ అలసి నిద్రలోకి జారుకుంటున్నారు పిల్లలు. ఇదేమంత మంచి అలవాటు కాదని అందరికీ తెలుసు కానీ ఎంత హానికకరం అన్నదాని మీద ఇప్పుడిప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

20 పరిశోధనల సారం

లండన్‌లోని కార్డిఫ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పిల్లల ఆరోగ్యం, అలవాట్ల మీద జరిగిన దాదాపు 20 పరిశోధనలను క్షుణ్నంగా పరిశీలించారు. ఇందులో భాగంగా 14 ఏళ్ల సగటు వయసున్న లక్షాపాతికవేల మంది పిల్లల సమాచారాన్ని గమనించారు. ఈ పరిశీలనలో పిల్లల మీద డిజటల్‌ మాధ్యమాల ప్రభావం గురించి అనేక విషయాలు వెల్లడయ్యాయి.

మంచం దగ్గరే

72 శాతం మంది పిల్లలు తమ మంచం దగ్గరే ఏదో ఒక డిజిటల్‌ పరికరాన్ని ఉంచుకుని నిద్రపోతున్నట్లు తేలింది. వీరిలో నిద్రపోయేందుకు ఒక 90 నిమిషాల ముందువరకు ఫోన్‌ చూస్తూ గడిపిన పిల్లల్లో 79 శాతం మంది నిద్రలేమితో బాధపడటాన్ని గమనించారు. ఒకవేళ నిద్రపట్టినా కూడా 46 శాతం మంది పిల్లలు కలతనిద్రలోనే గడపాల్సి వచ్చింది. ఇలా సరైన నిద్ర లేకపోవడంతో, వీరంతా ఉదయం వేళల్లో మత్తుతో తూగిపోవడం మొదలుపెట్టారట.

నిద్రే కాదు

పిల్లల ఎదుగుదలలో నిద్ర ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాంటి నిద్రే కనుక దూరమైతే వారు రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, ఉద్రేకంగా ప్రవర్తించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఊబకాయం, ఎదుగుదల సమస్యలు, మానసికమైన లోపాలు... వంటి సమస్యలన్నీ కూడా ఆ పిల్లవాడిని చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

కారణం ఇదీ!

ఫోన్, టాబ్లెట్‌, టీవీ వంటి పరికరాల నుంచి వచ్చే వెలుతురు మన శరీరంలోని మెలటోనిన్‌ అనే హార్మోనుని ప్రభావితం చేస్తుందట. మనలోని జీవగడియారాన్ని నియంత్రించే ఈ హార్మోనుని అడ్డుకోవడం వల్ల శరీరానికి నిద్రపోవాలన్న సూచన అందదు. చివరికి అది నిద్రలేమి అనే ఓ విషవలయానికి దారితీస్తుంది. ఇక డిజిటల్‌ పరికరాలతో ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో మునిగిపోవడం, గేమ్స్ ఆడటం, చాటింగ్‌ చేయడం వంటి చర్యల వల్ల పిల్లలోని ఉద్విగ్న స్థాయి పెరిగిపోతుంది. దాని వల్ల కూడా నిద్ర కరువవుతుంది. అంతేకాదు! ఒకవేళ ఫోన్ పక్కన పెట్టేసినా కూడా, మనసు దాని చుట్టూనే తిరిగే అవకాశం ఉందంటున్నారు. వాట్సప్‌లో ఎవరన్నా మెసేజ్‌ పంపి ఉంటారా! ఫేస్‌బుక్‌లో నేను పెట్టిన పోస్టుకి కామెంట్స్‌ ఏవన్నా వచ్చి ఉంటాయా! వంటి సవాలక్ష సందేహాలతో పిల్లల మెదడు మేలుకొనే ఉంటుంది. కాబట్టి రాత్రివేళల్లో పిల్లలు ఫోన్ల వ్యాపకానికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదే. బహుశా అదేమంత కష్టమైన పని కాదేమో! ముందు పెద్దవారు తమ చేతిలో ఉన్న ఫోన్లను పక్కన పెట్టి కాస్త పిల్లలతో మాట్లాడటం మొదలుపెటడితే... పరిస్థితులు సగం దారికి వస్తాయి.

 

 

- నిర్జర