వైజాగ్ లో అప్పుడే కేపిటల్ పనులు ప్రారంభం... ఏప్రిల్ నుంచే కార్యకలాపాలు...!

రాజధానిపై జగన్ సర్కారు నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇంకా రానే లేదు... కానీ, అసెంబ్లీ వేదికగా ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముందే ప్రభుత్వ నిర్ణయాన్ని దాదాపు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అప్పుడే పనులు కూడా ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టుకోవచ్చన్న జగన్....  అక్కడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలకు కావాల్సిన పనులను    ప్రారంభించేశారు. అయితే, ప్రభుత్వ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం మేరకు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం పరదేశిపురం ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ కోసం విశాఖ పరిసరాల్లో దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించారు. 

అంతేకాదు ఇప్పటికిప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలను విశాఖ నుంచి జరిపేందుకు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన రెండున్నర లక్షల చదరపు అడుగుల క్యాంపస్ ను వినియోగించుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించిన ఈ భవనాలను ఇమిడియట్ యూజ్ కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే, ఆంధ్రా యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న భవనాలను ప్రభుత్వం గుర్తించింది. అవసరమైతే ఈ బిల్డింగ్స్ ను కూడా అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలని చూస్తోంది. ఇక, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ నివాసం కోసం భీమిలి దగ్గర సముద్ర తీరంలో మూడు ఎకరాల భూమిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే, భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించనుండటంతో ఎయిర్ కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. 

మూడే మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2020 ఏప్రిల్ లోపే మొత్తం ఏర్పాట్లు పూర్తిచేసి అధికార యంత్రాంగాన్ని తరలించనుంది. ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా పర్ ఫెక్ట్ గా సాగేందుకు పార్టీలో ఐదుగురు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక, రాజ్ భవన్ కోసం కూడా అనువైన ప్రాంతాన్ని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది.